Pawan Kalyan on Housing Allocation Issue: ఆందోళన వైపు జనసేన, బీజేపీ.. విజయవంతం చేయాలని పవన్ ప్రకటన
Pawan Kalyan on Housing Allocation Issue: గత ప్రభుత్వ హాయాంలో చేపట్టిన జీ + 3 ఇళ్లను పూర్తిచేయడమే కాకండా, ఇప్పటికే పూర్తిఅయిన వాటిని సంబంధిత లబ్ధిదారులకు అందజేయాలి.
Pawan Kalyan on Housing Allocation Issue: గత ప్రభుత్వ హాయాంలో చేపట్టిన జీ + 3 ఇళ్లను పూర్తిచేయడమే కాకండా, ఇప్పటికే పూర్తిఅయిన వాటిని సంబంధిత లబ్ధిదారులకు అందజేయాలనే డిమాండ్ తో జనసేన, బీజేపీలు సంయుక్తంగా ఆందోళన చేపట్టేందుకు పిలుపునిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
జీ+3 గృహాల కేటాయింపు వ్యవహారంలో లబ్దిదారులకు న్యాయం జరిగే వరకు జనసేన - భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా పోరాటం చేస్తాయని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం ఇరు పార్టీలు నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం మధ్యాహ్నం జనసేన పార్టీ సంయుక్త పార్లమెంటరీ కమిటీలు, జనసేన-బీజేపీ సమన్వయ కమిటీ సభ్యులు, పార్టీ అధికార ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి నిరసన కార్యక్రమాలకుసంబంధించి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ "లబ్దిదారులు తమ వాటా మొత్తం చెల్లించిన తర్వాత ప్రభుత్వాలు మారిపోవడంతో కేటాయింపులు జరపకుండా వదిలేస్తున్నారు. గృహ నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మన రాష్ట్రంలోనూ ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించారు. నిర్మాణం చేపట్టారు. కొన్ని చోట్ల పూర్తయ్యాయి. ప్రభుత్వం మారాకా వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా నిలిపేశారు. దీంతో ప్రజాధనం విపరీతంగా దుర్వినియోగం అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాగే ఇళ్లు కట్టి వదిలేశారు. అవి ప్రస్తుతం శిధిలావస్థకు చేరుకున్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా జీ+3 గృహాల నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయి. రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు కట్టిన తర్వాత కూడా ఇళ్లు రాక లబ్దిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలులో జీ +3 గృహ సముదాయాలు ప్రత్యక్షంగా చూశాను. బాధితులతో మాట్లాడినప్పుడు వారు తమకు న్యాయం చేయాలని కోరారు. కట్టిన ఇళ్ల వ్యవహారంలో పాలకుల నిర్లక్ష్యంతో ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది. కట్టింది మా పార్టీ కాదు. మీరు వేరే పార్టీకి ఓటు వేశారు అనే మాటలు కాకుండా ఖచ్చితంగా అర్హులైన లబ్దిదారులకు న్యాయం జరగాలి. ఈ సమస్యపై బీజేపీతో కలసి సమష్టిగా ముందుకు వెళ్దాం. కరోనా కారణంగా.. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలకు అండగా ఉండాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలు చేపడదాం. రేపటి ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం" అన్నారు.