Pawan Kalyan: పిఠాపురంలో 3.52 ఎకరాల స్థలం కొనుగోలు చేసిన పవన్
Pawan Kalyan: పిఠాపురంలో రాత్రికి రాత్రే ఆకాశానంటుతోన్న భూముల ధరలు
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో అమరావతికి మళ్లీ మంచి రోజులొచ్చాయనే చర్చ జరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అమరావతి పూర్తిగా పడకేసిందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి కళకళలాడనుందని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్క అమరావతే కాదు, కొత్తగా జనసేన అధినేత గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలోనూ రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతోంది.
జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించడంతో ఆ నియోజకవర్గం రూపురేఖలు మారిపోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. దీనికి తగ్గట్టే పవన్‌కల్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేస్తానని, దేశంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఆయన తన కార్యాచరణను అమలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పిఠాపురంలోని భోగాపురం, ఇల్లింద్రాడ పరిధిలో 3.52 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. తన నివాసం, క్యాంపు కార్యాలయ నిర్మాణం కోసం ఆ స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. గతంలో ఎకరం స్థలం 15 నుంచి 16 లక్షలు, జాతీయ రహదారి 216కు దగ్గరలో అయితే 50 లక్షల వరకు ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా పవన్‌కల్యాణ్ అక్కడ స్థలం కొనుగోలు చేయడంతో పిఠాపురంలో అరకొరగా ఉన్న భూముల ధరలు రాత్రికి రాత్రే అమాంత ఆకాశంటుతున్నాయని చెబుతున్నారు. గొల్లప్రోలు టోల్‌ప్లాజా పక్కనే ఉన్న వ్యవసాయ భూమిని పవన్ కొనుగోలు చేయడంతో ఆ ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేసేందుకు రియల్టర్లు రైతుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటివరకు ఆ ప్రాంతంలో పల్లపు భూములకు అంత డిమాండ్ లేదని స్థానికులు చెబుతున్నారు. కేవలం వర్షం నీరుతోనే పంటలు సాగుచేస్తున్నారు. ఒకవేళ భారీగా వర్షాలు కురిసినా పంటలు నీటమునిగి రైతులు నష్టపోతున్నట్లు తెలిపారు. దీంతో భూ యజమానులు పంటలు పండించడం మానేశారని చెబుతున్నారు. ఆ భూములను కౌలుకు తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉండేదని అంటున్నారు. ప్రస్తుతం అక్కడ భూమి ఎకరానికి కోటి రూపాయలకు పైగానే పలుకుతుందని స్థానికులు చెబుతున్నారు. అయితే పవన్‌కల్యాణ్ కొనుగోలు చేసిన స్థలం మాత్రం ప్రభుత్వ నిర్ణయించిన ధరకే రిజిస్ట్రేషన్ చేయించారు.
మొత్తం 3.52 ఎకరాల భూమిని పవన్ లీగల్ అడ్వైజర్‌గా ఉన్న కాకినాడ పట్టణ జనసేన అధ్యక్షుడు తోట సుధీర్ ప్రతినిధిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. 1.44 ఎకరాలు డాక్యుమెంట్ గాను, 2.08 ఎకరాలు రెండో డాక్యుమెంట్‌గా రిజిస్ట్రేషన్ పూర్తయింది. నివాసం, క్యాంప్ ఆఫీస్‌తో పాటు కార్యకర్తలతో సమావేశానికి పెద్ద హాల్ కూడా ఇదే స్థలంలోనే నిర్మించడానికి ప్లాన్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.