Corona Cases in Chittoor : చిత్తూరు జిల్లాలో మళ్లీ కరోనా కలకలం
* 9రోజుల్లో ఐదు శాతానికిపైగా పాజిటివిటీ * 22 మండలాల్లో 2శాతానికిపైగా కేసులు * కోవిడ్ బారిన పడుతున్న 18ఏళ్ల లోపు వారు
Corona Cases in Chittoor: చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తిరిగి క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాలోని 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కేసుల పెరుగుదలను యంత్రాంగం గుర్తించింది. ఈనెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు పలు మండలాల్లో ఐదు శాతానికి మించి పాజిటివిటీ రేటు నమోదైందని అధికారులు చెబుతున్నారు. అలాగే మరో 22 మండలాల్లో సైతం రెండు శాతానికి మించి కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు.
జాతరలు, వివాహ వేడుకలకు అనుమతి లభించడం, ఆ కార్యక్రమాల్లో జనం మాస్కులు లేకుండా పాల్గొనడం వల్లే కేసులు పెరుగుతున్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. పెరుగుతున్న కేసుల్లో 18 ఏళ్లలోపు వయసు వారే ఎక్కువ మంది ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా థర్డ్ వేవ్ ముప్పు ఎక్కువగా పిల్లలపైనే ప్రభావం చైపుతుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలో ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయి.
వారం రోజుల వ్యవధిలో 60 మందికిపైగా పిల్లలు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో కోవిడ్ థర్డ్‌వేవ్‌పై అధికారులు, వైద్యులు ప్రతినిత్యం సమాలోచనలు జరుపుతున్నారు. జిల్లాలోని పరిస్థితులపై అంచనాలు వేస్తూ తదనుగుణంగా సమాయత్తమవుతున్నారు. వైద్యులు, నర్సులకు శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. అందరూ జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు.