Kadapa: భారీ వర్షాలతో 22,454 హెక్టార్లలో దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలు

* ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతు కుదేలు * ప్రాథమిక అంచనాలను ప్రభుత్వానికి నివేదించిన అధికారులు

Update: 2021-11-15 06:35 GMT

భారీ వర్షాలతో 22,454 హెక్టార్లలో దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలు(ఫైల్ ఫోటో)

Kadapa: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అన్నదాత కుదేలయ్యాడు. గతేడాది నివర్‌ తుఫాన్ మిగిల్చిన కష్టాల నుంచి ఇంకా తేరుకోకముందే వాయుగుండం రూపంలో జిల్లా రైతుల బతుకులను ఛిద్రం చేసింది. కొన్ని చోట్ల పంట పొలంలోనే దెబ్బతింటే మరికొన్ని చోట్ల మాత్రం చేతికొచ్చిన పంట వర్షర్పాణమైంది. దీంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 22వేల 454 హెక్టార్లలో ఉద్యాన, వ్యవసాయ పంటలు దెబ్బతినడంతో దాదాపు 17.51 కోట్లు నష్టపోయినట్లు జిల్లా అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ నష్టానికి తోడు పెట్టుబడి, దిగుబడి రూపాల్లో సుమారు మరో 500 కోట్ల నష్టం వాటిల్లిందని రైతులు కన్నీరుపెడుతున్నారు.

వరి, బుడ్డ శనగ, పత్తి, ఉల్లి, వేరుశనగ, టమోటా, మినుము తదితర పంటలు నష్టపోయాయి. దాదాపు 16వేల 335 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. సుమారు 214 కోట్లు నష్టం జరిగిందని వరి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ పంటలకు తోడు రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి ప్రాంతాల్లో ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. వర్షాల వల్ల 4వేల 616 హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. హెక్టారుకు సగటున 16వేల 95 రూపాయల నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు.

మొత్తంగా 68 కోట్లు నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. అధికారిక రికార్డుల ప్రకారం వ్యవసాయ, ఉద్యాన పంటలకు 17.51 కోట్లు నష్టం జరిగిందని నివేదిక. అయితే పెట్టుబడి, దిగుబడి రూపాల్లో మరో 283 కోట్లు నష్టపోయామని అన్నదాతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News