Telugu Academy: సాయికుమార్ ముఠాపై కీలక ఆధారాలు లభ్యం
Telugu Academy: తెలుగు అకాడమీ స్కాంలో వెలుగులోకి వచ్చిన కొత్త కోణం
Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల గల్లంతు వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయికుమార్ కోట్లు కొల్లగొట్టినట్టు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. సాయికుమార్, అతని అనుచరులు 12 ఏళ్ల కాలంలో 200 కోట్లు స్వాహా చేసినట్టు గుర్తించారు. సాయికుమార్ ముఠా ప్రభుత్వ సంస్థల ఫిక్స్ డ్ డిపాజిట్లను కొల్లగొట్టడంలో ఆరితేరినట్టు వెల్లడైంది.
సాయికుమార్, అతని అనుచరులు 12 ఏళ్ల క్రితం ఓ ముఠాగా ఏర్పడ్డారు. సాయికుమార్ బృందంపై ఇప్పటికే 7 కేసులు ఉన్నాయి. ఏపీలో మరో 2 ప్రభుత్వ శాఖల ఫిక్స్ డ్ డిపాజిట్లు కాజేసినట్టు వెల్లడైంది. సాయికుమార్ గతంలో స్వాల్ కంప్యూటర్స్ పేరిట ఓ సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహించాడు. చెన్నైకి చెందిన నేరస్తులతో అతడికి పరిచయాలు ఏర్పడ్డాయి. క్రమంగా వీరు ఓ ముఠాగా ఏర్పడి, బ్యాంకు అధికారులతో పరిచయాలు పెంచుకుని ఫిక్స్ డ్ డిపాజిట్లు గోల్ మాల్ చేయడం ప్రారంభించారు.
నకిలీ ఫిక్స్ డ్ డిపాజిట్ పత్రాలు తయారుచేసి ఆయా ప్రభుత్వ శాఖలకు అందించేవారు. అసలు పత్రాలను బ్యాంకుల్లో సమర్పించి ప్రభుత్వ సొమ్మును కొట్టేసేవారు. ఏపీ హౌజింగ్ బోర్డులో రూ.40 కోట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రూ.15 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖలో రూ.45 కోట్లు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్‌లకు సంబంధించిన రూ.15 కోట్ల డిపాజిట్లను దారి మళ్లించి విత్ డ్రా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే తెలుగు అకాడమీకి చెందిన రూ. 64.5 కోట్లను ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించి వాటాలుగా పంచుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ప్రధాన నిందితుడు సాయి కుమాకర్‌తో పాటు 9 మంది నిందితుల కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. దర్యాప్తులో పురోగతి, నిందితులు పంచుకున్న వాటాలపై పూర్తి సమాచారం కోసం మరో నాలుగు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. దీనిపై వాదనలను న్యాయమూర్తి ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు.