JD Lakshmi Narayana: జేడీ మళ్లీ జనసేనలో చేరుతారా?
JD Lakshmi Narayana: మొన్నటి వరకూ ఆ మాజీ ఐపీఎస్ అధికారి ఎక్కడా ఎక్కడా అంటూ అందరూ మాట్లాడుకున్నారు.
JD Lakshmi Narayana: మొన్నటి వరకూ ఆ మాజీ ఐపీఎస్ అధికారి ఎక్కడా ఎక్కడా అంటూ అందరూ మాట్లాడుకున్నారు. జనసేన నుంచి జంపైన తర్వాత జాడ లేదంటూ చర్చించుకున్నారు. కానీ పొలిటిక్స్ ఎప్పుడూ ఒకరకంగా ఉండవు కదా. అవును అది నిజమే అన్నట్టు ఆయన సేన వైపు చూస్తున్నారట. సేనానితో కలవాలని అనుకుంటున్నారన్న పుకార్లు రెక్కలు కట్టుకుని ఊరేగుతున్నాయి. సేనానితో సరిపడదని బయటకు వచ్చిన ఆ డైనమిక్ మాజీ ఐపీఎస్ మళ్లీ ఆ సైనికుల్లో తానూ ఒకడిగా ఉంటానంటూ ముందుకొస్తున్నారట. మరి పార్టీ అధినేతకు, మాజీ ఐపీఎస్‌కు దూరం తగ్గినట్టేనా వివాదాలు సమసినట్టేనా పవన్ సమక్షంలో త్వరలో జనసేన కండువా కప్పుకోనున్నారా?
జేడీ ఎక్కడ ఎక్కడా ఎక్కడా అంటూ, మొన్నటి వరకు వినిపించిన మాటలకు, ఊరేగిన ఊహాగానాలకు, ఊరూరు తిరిగిన గుసగుసలకు ఇదిగో, ఇదే నా ఆన్సర్ అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారట డైనమిక్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ. జనసేనలోకి జేడీ అనగానే హైఓల్టేజీ పవర్‌కు, మరింత హైఓల్టేజీ జత అయ్యిందని అందరూ అనుకున్నారు. పవన్ అంత మాస్ ఇమేజ్ లేకపోయినా, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా జేడీ లక్ష్మీనారాయణకూ ఎంతోకొంత పాపులారిటీ ఉంది. అందుకే ఇద్దరూ కలిస్తే, ఏపీ అంతా జనసేన కెరటాలు ఎగసిపడతాయని అనుకున్నారు. విశాఖలో ఎంపీగా ఓడిపోయినా, భారీ ఓట్లతో ఓటర్ల హృదయాలను గెలుచుకున్న లీడర్‌గా జేడీకి పేరొచ్చింది. కానీ అప్పుడప్పుడే గట్టి పునాదులు వేసుకుంటున్న జనసేనలో అధినేతకు, ఈ ఆఫీసర్‌కు మధ్య ఎందుకోగానీ లుకలుకలు పెరిగాయి. జనసేనలో తాను ఒంటిరి అవుతున్నాన్న ఫీలింగ్‌తో పాటు, తనకు ముందో మాట చెప్పి తర్వాత మాట మార్చారంటూ పవన్ సినిమా షూటింగ్‌ల విషయమొకటి తెరపైకి తెచ్చి జనసేనకు బై బై చెప్పేశారు.
వాస్తవానికి, జనసేనలో చేరిన తొలినాళ్లలో క్రియాశీలకంగా పనిచేశారు జేడీ. పార్టీలో చేరినప్పటి నుంచి జేడీకి కీలక స్థానం ఉంటుందని పవన్ కూడా ఎన్నోసార్లు ప్రకటించారు. ఇంతచెప్పిన తర్వాత కూడా కమిటీల్లో తనకు స్థానం లేకపోవడంతో అలిగి, దూరం పాటించారన్న చర్చ నడిచింది అప్పట్లో. అంతేకాకుండా జనసేనలో ఉంటూ కూడా ఇతర పార్టీ నేతలతో లక్ష్మీనారాయణ ఎక్కువగా టచ్‌లో ఉన్నారన్న సమాచారంతో పవన్, జేడీని దూరం పెడుతూ వచ్చారట. ఆ తర్వాత జేడీ కూడా సేనను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు రాజకీయంగానూ ఆయన ఎవరితో టచ్‌లో ఉన్నదీ లేదు.
ఇంత జరిగిన తర్వాత జేడీ రాజకీయ అడుగులపై ఇప్పుడో కొత్త చర్చ సరికొత్తగా జరుగుతోంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత విశాఖలో పర్యటించడం, ప్లాంట్ విషయంలో, ఉద్యోగులు, కార్మికల విషయంలో కానీ, తన స్టాండ్ ఏంటో బహిరంగ సభ ద్వారా చెప్పడాన్ని జేడీ స్వాగతించారు. అంతేకాదు, ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ క్రమంలోనే జేడీ మళ్లీ పవన్ ట్రాక్‌లోకి వస్తున్నారన్న చర్చ జనసేన సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. పవన్ నిర్ణయం ప్రభుత్వ ఆలోచనలను మార్పు వచ్చేలా చేస్తుందన్న జేడీ కామెంట్స్‌పై ఆసక్తికరమైన చర్చా నడుస్తోంది. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయడం పక్కా అంటూ, తాను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నానంటూ చెప్పుకుంటున్న జేడీ త్వరలోనే ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంటారని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.
ఇక్కడో విషయం గురించి మాట్లాడుకోవాలి. జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత జేడీ, స్వచ్ఛంద సేవ వైపు వెళ్లారు. జేడీ ఫౌండేషన్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి, రైతుల కోసం పనిచేస్తున్నారు. ఇతర అంశాలపైనా స్పందిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిన జేడీ ఆ తర్వాత పవన్‌తో ఎన్నో రోజులు ట్రావెల్ చేయలేదు. నిజానికి, సినిమాల విషయం తప్ప పవన్‌కు, జేడీకి మధ్య వేరే విషయాల్లో పెద్దగా బేధాభిప్రాయాలు లేవు కాబట్టి గ్యాప్ కూడా పెద్దగా లేదు కాబట్టి జనసేనతోనే జేడీ ప్రయాణం చేసే చాన్సెస్ ఎక్కువున్నాయన్న టాక్ వినిపిస్తోంది. తాను మళ్లీ జనసేనలో చేరుతారా లేదా అని జేడీ క్లియర్‌గా చెప్పకపోయినా వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం నడుస్తోంది. ఏమైనా క్రాస్‌రోడ్స్‌లో నిలబడ్డ జేడీ, ఎటువైపు అడుగులు వేస్తారన్నది, ఆయనే చెప్పాలి.