అమాయకులపై కాదు.. నా జోలికి రండి చూసుకుందాం: పవన్ కళ్యాణ్
Pawan Kalyan:జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Pawan Kalyan: జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ ప్రభుత్వం సామాన్యులపై ప్రతాపం చూపిస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. సమీప భవిష్యత్తులో రాష్ట్ర దశ, దిశ మారాల్సిన అవసరం ఉందని.. స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థను తీసుకురావాలని ఆయన అన్నారు. తిరుపతి నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సునీల్ దేవధర్, నాదెండ్ల మనోహర్ సభకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇస్తే వైసీపీ ఏం చేసింది? అమాయకులపై కేసులు పెట్టి కక్ష సాధిస్తోంది. దమ్ముంటే నా జోలికి రండి చూసుకుందాం. ఇంతమంది ఎంపీలున్నా రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారు. తిరుపతి ఎంపీగా అర్హత ఎవరికి ఉంది?వైకాపా ఎంపీ గెలిచినా ఆయనకు గొంతు ఉంటుందా? తిరుపతిని ఎవరు అభివృద్ధి చేయగలరో ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఢిల్లీలో రాష్ట్ర సమస్యలు చెప్పడంలో పూర్తిగా విఫలమయ్యారు.
వైసీపీ ఓటేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు. కోట్ల రూపాయలు పన్ను కట్టాను తప్ప.. కాంట్రాక్టులను కాజేయలేదు. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పేకాట క్లబ్‌లు లేవు. అందుకే నేను మళ్లీ సినిమాలు చేస్తున్నాను. తిరుపతి నడిబొడ్డు నుంచి వైసీపీ సర్కార్ ను హెచ్చరిస్తున్న. ఇది నవతరం.. చొక్కా పట్టుకుని ప్రశ్నిస్తాం. ప్రతి అధికార పార్టీ ఎమ్మెల్యే గుండాలా మాట్లాడుతున్నారు. అన్నమయ్య నడయాడిన నేల.. శ్రీకృష్ణదేవరాయలు ఏలిన నేల ఇది. పోరాడితే బానిస సంకెళ్లు పోతాయి. రాగిసంగటి తిని బతుకుతాను తప్ప తప్పుడు పనులు చేయను అని పవన్ అన్నారు.
అంతకుముందు బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరఫున తిరుపతి ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడీ కూడలి వరకు పవన్ పాదయాత్రగా వచ్చారు. పాదయాత్ర స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది.