జనసేనతో జోడీకి కటీఫేనా.. షాకు కోపం తెప్పించిన పవన్ తీరేంటి?

Andhra Pradesh: ఏపీ బీజేపీ బలోపేతం కావాలంటున్నారు అమిత్ షా.

Update: 2021-11-18 09:55 GMT

జనసేనతో జోడీకి కటీఫేనా.. షాకు కోపం తెప్పించిన పవన్ తీరేంటి?

Andhra Pradesh: ఏపీ బీజేపీ బలోపేతం కావాలంటున్నారు అమిత్ షా. కొత్త నేతలకు వెల్‌కమ్‌ చెప్పాలంటున్నారాయన. అంతేకాదు, మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పారట. నెక్ట్స్ ఎలక్షన్స్‌లో ఒంటరి పోటీకి కూడా సిద్దంగా వుండాలన్నారట. అంటే, జనసేనతో పొత్తు వద్దన్నట్టేనా? పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ కూడా దూరం జరగాలని డిసైడయ్యారా? అమిత్ షా వ్యాఖ్యల సారాంశం అదేనా? ఏ విషయంలో పవన్‌ కల్యాణ్‌పై, అమిత్‌ షా కాస్త ఫీలయ్యారు? జనసేనతో విడాకులు తప్పవని అమిత్ షా ఎందుకంటున్నారు?

ఆంధ్రప్రదేశ్‌లో సమీకరణలు కొత్త బాటపడుతున్నట్టు కనిపిస్తున్నాయి. కేంద్రహోంమంత్రి అమిత్ షా, తిరుపతి రెండు రోజుల పర్యటనలో, ఈ దిశగా సంకేతాలు వెలువడ్డాయని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలతో సమావేశమైన అమిత్‌ షా, వాడివేడిగా అనేక అంశాలపై మాట్లాడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలోపేతంపై చర్చించిన అమిత్ షా, అత్యంత కీలకమైన ఒక విష‍యంలో ఫుల్‌ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దేవదర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్, ఎంపీలు జీవీఎల్, సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు, సీనియర్ నేతలు పురంధ్రీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలతో సమావేశమైన అమిత్ షా, ఏపీలో రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఒకవైపు తెలంగాణలో బీజేపీ శరవేగంగా బలోపేతం అవుతుంటే, ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా, ఊపులేదు, ఉత్సాహం లేదు, కారణాలేంటని అమిత్ షా ఆరా తీసినట్టు తెలుస్తోంది.

రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బీజేపీ పోటీ చెయ్యడానికి తీసుకోవాల్సిన ప్రణాళికలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఎవరితో కలిసి బరిలోకి దిగుతామో చెప్పలేమని, అసలు మరో పార్టీతో కలిసి ఎన్నికలను ఎదుర్కొంటామా లేదా, సింగిల్‌గా ఫైట్‌ చేస్తామో చెప్పలేమని నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు అమిత్‌ షా. ఒంటరిగా పోటీ చేద్దామంటే అర్థం, జనసేనతో కటీఫేనా? పవన్‌తో కలిసి ఎన్నికలను ఎదుర్కొనే అవకాశం కనిపించడం లేదా? జనసేనను పక్కనపెట్టాలని అమిత్ షా డిసైడయినట్టేనా? అమిత్ షా ఎందుకిలాంటి నిర్ణయానికి వస్తున్నారు? పవన్‌పై నమ్మకం కుదరడం లేదా?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులుండరన్నది ఎవర్‌గ్రీన్‌ సామెత. అందుకు 2014, 2019 ఎన్నికల భాగస్వామ్యాలే నిదర్శనం. 2014 పోల్స్‌లో తాము పోటీ చెయ్యకపోయినా, బీజేపీ, టీడీపీలకు మద్దతిచ్చారు పవన్. అదే 2019లో రెండు పార్టీలకూ దూరంగా, ఒంటరిగా బరిలో నిలిచారు. ఎన్నికలైన తర్వాత మనసు మారి, కమలం చెంత చేరారు. కలిసి ఉద్యమాలు, ఆందోళనలు చేద్దామని ఇరు పార్టీల నేతలు హడావుడి చేశారు. కానీ ఒకట్రెండు నిరసనలు మినహా ఎవరి కుటీరం వారిదైంది. రెండు పార్టీలు కలిసి ఉమ్మడి ఆందోళనల ఊసేలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విడివిడిగా పోటీ చేశారు. మొన్న జరిగిన బద్వేల్ బైపోల్‌లోనూ, బీజేపీతో కలిసి ఉమ్మడి ప్రకటన చెయ్యకుండా, అసలు తాము పోటీలో వుండట్లేదని పవన్‌ ప్రకటించారు. తాము మాత్రం బరిలో వుంటామని పోటీ చేసింది కాషాయం. కమలంతో జనసేన కటీఫ్‌కు ఇదే నిదర్శమన్న చర్చ మొదలైంది. తాజాగా అమిత్ షా మీటింగ్‌ సారాంశం కూడా అదేనన్న వాదన వినిపిస్తోంది.

కేవలం ఉమ్మడి పోరాట వేదికలు లేకపోవడమే కాదు, అనేక అంశాల్లోనూ భిన్నమైన విధానాలే. మూడు రాజధానులపై రెండు పార్టీల మధ్య పొంతన కుదరని కామెంట్లు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై సడెన్‌గా టోన్‌ చేంజ్ చేశారు పవన్ ‌కల్యాణ్. గతంలో ప్రైవేటీకరణకు మద్దతిచ్చి, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నట్టు ఆందోళన చేశారు. ఈ సంకేతాలన్నీ తమతో పవన్‌ దూరం కావడానికి డిసైడైనట్టుగా కమలం నేతలు ఫిక్స్‌ అయ్యేలా చేస్తున్నాయి. మిత్రపక్షమైనందున, కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్థించాలని, ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడితే, జనంలో కూటమి పట్ల కన్‌ప్యూజన్‌ వస్తుందని కాషాయనేతలు, అమిత్ షాతో అన్నట్టు తెలుస్తోంది. పవన్‌ తీరు, టీడీపీతో దగ్గర కావడానికి చేస్తున్న ప్రయత్నాలను అర్థం చేసుకున్న అమిత్ షా, అలాంటప్పుడు ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుదామని పార్టీ నేతలతో అన్నట్టు తెలుస్తోంది. పవన్‌ తీరుపై అమిత్ షా ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మిత్రపక్షంతో వ్యవహరించే తీరు ఇదేనా అన్నట్టు తెలుస్తోంది. జనసేనను దూరంపెట్టడమే మేలని, లేదంటే పార్టీ శక్తివంతం కావడం కష్టమని, షా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

మొత్తానికి మొన్నటి వరకు కమలసేన రాజకీయ ప్రయాణంలో ప్రచారంలో వున్న అనుమానాలు నిజమేనని, అమిత్ షా మాటలను బట్టి మరింతగా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి, ఇవన్నీ ప్రచారాలుగానే మిగిలిపోతాయో? లేదంటే నిజంగా ఎవరిదారి వారు చూసుకుంటారో?

Tags:    

Similar News