వైఎస్‌ఆర్ సీపీలో కీలక మార్పులు.. 8 జిల్లాల్లో పార్టీ అధ్యక్షులను మార్చిన జగన్
* ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతల నుంచి... సజ్జల, బుగ్గన, అనిల్, కొడాలికి ఉద్వాసన
YSRCP: వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షులు సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించిన ఏపీ సీఎం జగన్ గతంలోనే హెచ్చరించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా సమీక్ష జరిపినప్పుడు పార్టీలో పనిచేయని వారికి ఉద్వాసన తప్పదని జగన్ హెచ్చరించారు. ఈ నేపథ‌్యంలోనే 8 జిల్లాల్లో వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షులను మార్చారు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు జగన్ అల్టిమేటం జారీ చేశారు. ముఖ్యమంత్రి హెచ్చరికల నేపథ్యంలో ముగ్గురు జిల్లా అధ్యక్షులు తాము పని చేయలేమని, తమ స్థానంలో కొత్త వారిని నియమించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే జగన్ మార్పులు చేర్పులు చేశారు. మిగిలిన 5 జిల్లాల్లో పార్టీ అధిష్ఠానమే మార్చేసింది
కుప్పం వైఎస్‌ఆర్ సీపీ బాధ్యుడైన ఎమ్మెల్సీ భరత్‌ను చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఆ బాధ్యతను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి అప్పగించారు. ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, అవంతి శ్రీనివాస్, సుచరిత, బుర్రా మధుసూదన్ యాదవ్, వై.బాలనాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రాంతీయ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్‌కుమార్ యాదవ్‌లనూ పార్టీ పదవుల నుంచి తొలగించారు.
తిరుపతి జిల్లా వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డిని కీలకమైన ఆ పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగా నియమించారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఎంపీ విజయసాయిరెడ్డికి చెవిరెడ్డి సహాయకారిగా వ్యవహరిస్తారని వైకాపా కేంద్ర కార్యాలయం ప్రకటించింది.