పవన్‌...ఔర్‌ పొలిటికల్ మూవీ!

Update: 2020-02-05 11:05 GMT

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సరికొత్త రాజకీయానికి పదునుపెట్టారా? ఒకవైపు పార్టీ నుంచి కీలక నాయకులు వెళ్లిపోతున్నారు? పోతూపోతూ విమర్శలు చేస్తున్నారు, కానీ పవన్‌ మాత్రం వారిపై సెటైర్స్‌ వేయడంలో అర్థమేంటి? జనసేన ఏకైక ఎమ్మెల్యేపై పవన్‌ తొలి స్పందన పరమార్థమేంటి? హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో పక్కా పొలిటికల్‌ మూవీ చెయ్యబోతున్నారా? వేటికవే భిన్నమైన అడుగులు వేస్తున్న పవన్‌లో, ఈ కొత్త మార్పేంటి?

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, రాజకీయం రోజురోజుకు కొత్తకొత్తగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, ఏమాత్రం పట్టుదల సడలనివ్వని పవన్, పొలిటికల్‌ ఈక్వేషన్స్‌పై పట్టు పెంచుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నట్టు కనపడుతోంది. ప్రత్యేక హోదాపై ధాటిగా విమర్శించిన బీజేపీతోనే చివరికి స్నేహానికి చేయి చాచారు. అసలు సినిమాల జోలికే పోను, ఇక మొత్తం రాజకీయమేనని నాడు చెప్పి, నేడు వరుసబెట్టి సినిమాలకు క్లాప్‌ కొడుతున్నారు. పార్టీ నుంచి కీలక నాయకులు వెళ్లిపోతున్నా, ఐ డేంట్‌ కేర్‌ అన్నట్టుగా ముందుకెళుతున్నారు.

బీజేపీతో పొత్తు, ఉమ్మడి కార్యక్రమాలపై కసరత్తు పూర్తయిన తర్వాత, రెండు పార్టీలు కలిసి, లాంగ్‌ మార్చ్‌తో తొలి నిరసనకు శ్రీకారం చుడతాయన్నారు పవన్. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఎప్పటికప్పుడు వాయిదపడుతూనే వుంది. బీజేపీతో ఈ విషయంలో పేచి వచ్చిందా? లేదంటే ఏ కారణాలతో లాంగ్‌ మార్చ్‌ను పోస్ట్‌పోన్ చేస్తున్నారన్నది, జనసైనికులకే అర్థంకావడం లేదట. తలపెట్టిన తొలి కార్యక్రమమే ఇలా ఒక అడుగు ముందుకీ, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగితే, ప్రత్యర్థుల్లో చులకన అవుతామంటున్నారు జనసైనికులు.

ఇక పార్టీని వీడివెళ్తున్న నేతలపై పవన్‌ స్పందించారు. ఇప్పుడు పార్టీని వీడుతున్నవారిలో, పార్టీ స్థాపన టైంలో వున్నవారెవరూ లేరని అన్నారు పవన్. ఏదో ఆశించి, ఏదో అయిపోదామని ఆశపడ్డవాళ్లే వీళ్లంతా అన్నట్టుగా మాట్లాడారు. రాపాక అసలు పార్టీలో వున్నారో లేరోనని, మొదటిసారి నేరుగా రియాక్ట్‌ అయ్యారు పవన్.

రాజధాని లాంగ్‌ మార్చ్, పార్టీని వీడుతున్న నాయకులపై పవన్‌ స్పందన అలా వుంచితే, ఇప్పుడు జనసేనలోనే కాదు, రాష్ట్రమంతా హాట్ టాపిక్‌ పవన్ కొత్త సినిమాలు. వరుసబెట్టి సినిమాలకు క్లాప్‌ కొడుతున్నారు. పింక్‌ రీమేక్‌ లాయర్‌ సాబ్‌ ఇప్పటికే షూటింగ్‌ మొదలైంది. క్రిష్‌ దర్శకత్వంలో సినిమా త్వరలో పట్టాలెక్కబోతోంది. ఇక గబ్బర్‌ సింగ్‌ ఫేమ్‌ హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లోనూ ఓ చిత్రం, రాబోందట.

అయితే, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రాబోతున్న మూవీ కథపై ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లోనే కాదు, అటు రాజకీయ వర్గాల్లోనూ వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఇది పక్కా పొలిటికల్‌ మూవీ అన్న చర్చ జరుగుతోంది. ఇందులో పవన్‌ పవర్‌ఫుల్‌ రాజకీయ నాయకుడిగా కనిపిస్తారన్న మాటలు వినపడ్తున్నాయి. జనానికి పవన్‌ ఏం చెయ్యాలనుకుంటున్నారు, వ్యవస్థను ఎలా ప్రక్షాళన చెయ్యబోతున్నారన్న కథనంతో, ఈ సినిమా వుంటుందని, పవన్ అంతరంగం తెరపై ఆవిష్కృతమవుతుందన్న డిస్కషన్ సాగుతోంది. అయితే, పొలిటికల్ సైటైర్లూ పేలవబోతున్నాయని తెలుస్తోంది. అవి ఎలాంటి కాంట్రావర్సీ క్రియేట్ చేస్తాయోనన్న చర్చా జరుగుతోంది.

అయితే, సినిమాలే చెయ్యను, రాజకీయాలకే పరిమితమవుతానన్న పవన్, ఇప్పుడెందుకు మళ్లీ ముఖానికి రంగేసుకుంటున్నారన్న విమర్శలు వినపడ్తున్నాయి. పార్టీ నిర్మాణం చేయకుండా, పూర్తిస్థాయి రాజకీయాల్లో లేకుండా, ఇలా పార్ట్‌ టైం పాలిటిక్స్‌ ఏంటని కొందరు విమర్శిస్తున్నారు. అయితే, అటు సినిమాలు, ఇటు రాజకీయాలూ చేస్తానంటున్నారు పవన్. మార్నింగ్, ఈవెనింగ్ మాత్రమే సినిమా షూటింగ్‌లు చేస్తానని, మిగతా డే టైం మొత్తం రాజకీయాలకేనంటున్నారు పవన్. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తానంటున్నారు.

మొత్తానికి ఎన్నికల తర్వాత పవన్ రాజకీయం మొత్తం మారిపోయింది. ప్రసంగాల్లో కాషాయం, బీజేపీతో పయనం, ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఇలా పవన్‌ పాలిటిక్స్‌ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. చూడాలి, మున్ముందు జనసేనుడి రాజకీయం ఇంకెంత రంజుగా వుంటుందో. 

Tags:    

Similar News