తొలివిడత పంచాయతీ పోరు.. ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఏకగ్రీవం కష్టమేనా
*ప్రకాశం జిల్లాలో ఒంగోలు, పర్చూరు సంతనూతలపాడు... *నియోజకవర్గాల్లో తొలివిడత పంచాయతీ పోరు *జిల్లాలో కనిపించని వైసీపీకి ఏకగ్రీవం దక్కే అవకాశాలు
తొలిదశలో పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మూడు నియోజకవర్గ లలో తొలివిడత పోరుకు నామినేషన్ల పరంపర మొదలైంది. అవకాశమున్న ప్రతీ పంచాయతీలో ఏకగ్రీవం చేసుకునే ఆలోచనలో వైసీపీ ఉంది. భారీ ఆశలతో రంగంలోకి దిగిన వైసీపీకి ఏకగీవ్రంగా చేజిక్కే పంచాయతీలు పెద్దగా కనిపించకపోవడం విశేషం.
ప్రకాశం జిల్లాలో తొలిదశ పోరులో ఒంగోలు, పర్చూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకుగాను నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజు పెద్దగా నామినేషన్లు దాఖలు కాకపోయినా రానురాను ఎక్కువ సంఖ్యలో దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. చీరాల నియోజకవర్గంలో ఎన్నికలు కోర్టు కేసులు కారణంగా నిలిచి పోయాయి. ఇక పర్చూరు, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, ఒంగోలు నియోజకవర్గంలో కొత్తపట్నం, రూరల్ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
పర్చూరు నియోజకవర్గంలో 95 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీలో స్థానిక పరిస్థితులను జీర్ణించుకోలేక అసంతృప్తితో రగిలిపోతున్న ద్వితీయశ్రేణి నేతలు పలు గ్రామాల్లో టీడీపీ తరఫున ముందుకొచ్చిన యువతరం నేతలను ప్రోత్సహిస్తుండటం విశేషం. తాజా పరిస్థితిని పరిశీలిస్తే అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవం చేసుకోవాలన్న వైసీపీ నేతల ఆశలు అడియాశలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎస్‌ఎన్‌పాడు, మద్దిపాడులాంటి మండలాల్లో ఏకగీవ్రమయ్యే పంచాయతీలు అతి స్వల్పంగా ఉన్నాయి. చివరకు చీమకుర్తి మండలంలోనూ సీఎం సామాజికవర్గం బలంగా ఉన్న ఐదారు పంచాయతీల్లోనే ఏకగ్రీవంగా వైసీపీ మద్దతుదారులు సర్పంచ్ పదవులను గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. పూర్తిగా వైసీపీకి పట్టు ఉన్న రాపర్లతో పాటు ఎన్‌జీపాడు పంచాయతీని ఏకగీవ్రంగా చేజిక్కుంచుకునే ప్రయత్నంలో వైసీపీ ఉంది. మద్దిపాడు మండలంలో ఒకటి రెండు మినహా ఏకగ్రీవంగా వైసీపీ మద్దతుదారులకు పంచాయతీలు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఏకగ్రీవాల కోసం ప్రతిపక్ష టీడీపీ మద్దతుదారులను, సొంత పార్టీలోని అసమ్మతివాదులను లోబర్చుకోవాలని ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఒంగోలు నియోజకవర్గంలోని రూరల్ మండలంలో 12 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఏకగ్రీవాలు రెండు మూడు కన్నా ఎక్కువ కనిపించడం లేదు. కొత్తపట్నం మండలం ఆశాజనక పరిస్థితి ఉంది. కొత్తపట్నంలో సీపీఐ నేతలు పోటీకి సిద్ధమవుతుండగా, వారికి మద్దతిచ్చి చేతులు దులుపుకోవాలని టీడీపీ నేతలు చూస్తున్నారు.