Tirupati: అటకెక్కిన తిరుపతి అంతర్జాతీయ రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్

Tirupati: కొత్త ట్రైన్ల అవసరం కూడా ప్రస్తుతానికి లేదన్న కేంద్రం

Update: 2022-03-13 07:30 GMT

అటకెక్కిన తిరుపతి అంతర్జాతీయ రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్

Tirupati: తిరుపతి కేంద్రంగా ప్రకటించిన తొలి అంతర్జాతీయ ప్రాజెక్టు అటకెక్కింది. భారతీయ రైల్వేస్ సంస్థలో అత్యంత ఆదాయం సమకూర్చి పెట్టే తిరుపతి స్టేషన్‌కు వరల్డ్ క్లాస్ స్టేటస్ అందని ద్రాక్షగా మారింది. UPA ప్రభుత్వ హయాంలో, ఇటు లాలూ నుంచి మమత బెనర్జీ రైల్వే బడ్జెట్ సందర్భంగా తిరుపతిపై కురిపించిన ప్రేమ కాగితాలకే పరిమితమైంది. ఫలితంగా తిరుపతికి గ్రేడ్ టు సబర్బన్ రైల్వే స్టేషనే గతిగా మారింది‌. తిరుపతి ఎంపీ గురుమూర్తి పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చిన కేంద్రం తిరుపతి వరల్డ్ క్లాస్ స్టేషన్ లేదని కుండబద్దలు కొట్టింది. 2021 డిశంబర్ 15న కేంద్రం నుంచి వచ్చిన సమాధానంలో తిరుపతి నాన్ గ్రేడ్ 2 పరిధిలో ఉన్న స్టేషన్ గా చెప్పడంతో 15ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మూడేళ్లుగా తిరుపతి రైల్వేస్టేషన్‌కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు కావల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. కొత్త ట్రైన్ల అవసరం కూడా ప్రస్తుతానికి లేదని తేల్చేసింది.

భారతీయ రైల్వేస్‌లో తిరుపతి స్టేషన్‌కు ఒక ప్రాధాన్యత ఉంది‌. ప్రముఖ యాత్రా స్థలం కావడంతో దేశంలోని అన్ని ప్రాంతాలకు తిరుపతి రైల్వేస్టేషన్‌కు కనెక్టివిటీ ఉంది. దీంతో దేశ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే యాత్రికులలో అత్యధిక శాతం మంది రైలు మార్గాలనే ఎంచుకుంటారు. అందుకే ఇక్కడికి రోజుకు సరాసరి 80 సర్వీసులు నడుస్తుంటాయి. రోజువారి ఆదాయంలోనూ దేశంలో మొదటి వరుసలో ఉంది. ఈ క్రమంలో రైల్వేస్టేషన్ అభివృద్దిపై ఇక్కడి ప్రజా ప్రతినిధులు దశాబ్దాలుగా చేసిన అభ్యర్థనలపై గత పాలకులు వరాల జల్లు కురిపించారు.అధికారంలోకి వచ్చిన ఎన్డీఎ ప్రభుత్వం తిరుపతి వరల్డ్ క్లాస్ స్టేటస్ ఊసే ఎత్తలేదు. అప్పుడప్పుడు రైల్వేమంత్రులు అంతో ఇంతో నిధులు విదిల్చినా అది సబర్బన్ స్థాయిని పెంచలేదు. వరల్డ్ క్లాస్ స్థాయికి చేర్చలేదు. దీంతో తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్ కథ కంచికే అన్నట్లుగా మారిందని తిరుపతి వాసులు మండిపడుతున్నారు. 

Tags:    

Similar News