West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో బీభత్సం సృష్టించిన గులాబ్ తుఫాన్
* 19మండలాల్లో 100మి.లీ వర్షపాతం నమోదు * వందలాది ఎకరాల్లో నీట మునిగిన పంట
West Godavari: పశ్చిమగోదావరి జిల్లాను గులాబ్ తుఫాన్ అతలాకుతలం చేసింది. ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాలకు జిల్లా మొత్తం జలమయం అయింది. వర్షపు నీటి ప్రవాహానికి కల్వర్టులు, దుకాణాలు కొట్టుకుపోయాయి. జిల్లాలో ఉన్న జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. వర్షపు నీరు రోడ్లపై భారీగా ప్రవహించడంతో అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని 19 మండలాలల్లో వంద మిల్లి లీటర్లకు పైగా వర్షం పాతం కురిసింది. ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చింది. దాని ప్రభావం సమీప గ్రామాలపై పడింది. వరదనీటిలో పలు గ్రామాలు చిక్కుకుపోయాయి.
మరోవైపు జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టెన్న పాలెం జల్లేరు వాగు పొంగిరోడ్డుపై నుంచే నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కామవరపుకోట మండలం ఆడమిల్లిలోని నాగుల చెరువు పొంగి ప్రవహించడంతో ఏలూరు జంగారెడ్డిగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలం పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ఉధృతంగా ప్రవహించింది. మిర్చి, మినుము, ఇతర పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని మన్యప్రాంతంపై కూడా గులాబ్ తుఫాన్ ప్రభావం చూపించింది. జిలుగుమిల్లు మండలంలో గిరిజన గ్రామాల రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో పలుగ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. సుమారు 30 గిరిజన గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి.