Amaravati: నేటి నుండి ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు

Amaravati: రాష్ట్రంలో నేటి నుండి వడగాడ్పులు మొదలు కానున్నాయి. మరో వైపు కరోనా కేసులు వెయ్యికి చేరువయ్యాయి.

Update: 2021-03-27 02:38 GMT

అమరావతి:(ఫైల్ ఇమేజ్)

Amaravati: అసలే కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడుతున్న జనానికి ప్రతికూల వాతావరణం దడపుట్టించనున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన ప్రకారం నేటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడగాడ్పులు మొదలు కానున్నప్పటికీ ఆదివారం నుంచి మరింత ఉధృతరూపం దాల్చనున్నాయి. మొత్తం 670 మండలాలకు గాను శనివారం వివిధ జిల్లాల్లోని 94 మండలాలు, ఆదివారం 102 మండలాల్లోను వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండనుంది. వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలులే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్‌ 1నుంచి ఉష్ణోగ్రతల పెరుగుదల మరింత అధికమవుతుందని చెబుతున్నారు.

వెయ్యికి చేరువలో కరోనా కేసులు...

రాష్ట్రంలో ఒక్క రోజు నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య వెయ్యికి చేరువ అవుతున్నాయి. అయిదు రోజులుగా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24గంటల్లో 984 మంది కొవిడ్‌-19 బారినపడ్డారు. గడిచిన 4 నెలల్లో రోజువారీ కేసులను పరిశీలిస్తే ఇవే అత్యధికం కావడం గమనార్హం. గతేడాది నవంబరు 24న 1,085 కేసులు నమోదుకాగా.. ఆ తర్వాత అత్యధిక కేసులు ఇవే. రాష్ట్ర వ్యాప్తంగా 40,604 నమూనాలు పరీక్షించగా 2.42శాతం కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు 8,93,968మంది వైరస్‌ బారినపడ్డారు. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒకరి చొప్పున మృతి చెందారు. 306మంది కోలుకున్నారు. గుంటూరులో అత్యధికంగా 176, విశాఖపట్నం 170, చిత్తూరు 163, కృష్ణా 1,10 కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరు అప్రత్తంగా వుండాలని, ఎక్కువగా పానియాలు తీసుకుంటూ, కరోనాకు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.


Tags:    

Similar News