భారీ వర్షాలతో తూర్పుగోదావరి అతలాకుతలం

అకాల వర్షాలు.. తూర్పుగోదావరి జిల్లాను అతలాకుతలం చేసాయి. వేలాది ఎకరాల్లో పంటలను నాశనం చేశాయి. ఈ వర్షాలు రైతులతో పాటు సామాన్యులకు శాపంగా మారింది.

Update: 2020-10-22 16:21 GMT

అకాల వర్షాలు.. తూర్పుగోదావరి జిల్లాను అతలాకుతలం చేసాయి. వేలాది ఎకరాల్లో పంటలను నాశనం చేశాయి. ఈ వర్షాలు రైతులతో పాటు సామాన్యులకు శాపంగా మారింది. వేలాది ఎకరాల్లో వేసిన కాయగూరలు.. ఉల్లిపంటలు నీట మునగడంతో బహిరంగ మార్కెట్లో వాటి ధరలు అమాంతంగా పెరిగాయి. పంటలు నీట మునగడంతో మార్కెట్లో కాయగూరలు కనిపించడమే కష్టంగా మారింది.

తూర్పుగోదావరి జిల్లాలో కాయగూరలు.. ఉల్లి ధరలు ఆకాశనంటుతున్నాయి.. సామాన్యులకు అందనంత ఎత్తులోకి ఎగబాకాయి.. ధరలు అమాంతం పెరగడంతో పేద మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారు.. రైతు బజార్లలోనూ బహిరంగ మార్కెట్‌తో పోటాపోటీగా ధరలు పెరగడంతో సామాన్యులకు కాయగూరలు చుక్కలు చూపిస్తున్నాయి.. రైతు బాజార్లలో కిలో 50 రూపాయిలకు లభ్యమౌతున్న ఉల్లిపాయలు.. బహిరంగ మార్కెట్‌లో 100 నుంచి 120 రూపాయిలు చెల్లిస్తేనే లభ్యమౌతున్నాయి.

లాక్‌డౌన్ సమయాల్లో సైతం కిలో 15 నుంచి 20 రూపాయిలకు లభించిన ఉల్లి ప్రస్తుతం సామాన్యులకు కోయకుండానే కంటనీరు తెప్పిస్తోంది. ఇక ప్రజలు నిత్యం వినియోగించే బీరకాయ.. బెండకాయ.. వంకాయ.. దొండకాయ.. మునగ వంటి కాయగూరలు ధరలకు రెక్కలొచ్చాయి. బహిరంగ మార్కెట్లో వీటి ధరలు 80 నుంచి 100 రూపాయిల పై మాటగానే ఉంటోంది.. చిక్కుడు కాయ.. కాకరకాయ వంటి కూరగాయలు అయితే అసలు దొరకడమే కష్టతరంగా మారింది.. కిలో టమాటా 60 రూపాయిల నుంచి 80 వరకు పలుకుతోంది.. అవసరాలకు అనుగుణంగా కాయగూరలు.. ఉల్లిపాయలు లభించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కాకినాడలో తీరం దాటడంతో భారీ వర్షాలు తూర్పుగోదావరి జిల్లాను అతలాకుతలం చేసాయి.. అంతకు ముందు గోదావరి వరదలకు కోనసీమ లంకల్లో కాయగూరల పంటలకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మెట్ట ప్రాంతంలో కాయగూరలు పంటలు పూర్తిగా కుళ్లిపోయాయని రైతులు వాపోతున్నారు.ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో కాయగూరల పంటలు నీటమునిగి ఉండటంతో స్ధానికంగా పండించే కాయగూరలు మార్కెట్ కు అతి తక్కువగా వస్తున్నాయి..

ప్రత్తిపాడు.. జగ్గంపేట.. పెద్దాపురం.. పిఠాపురం.. గొల్లప్రోలు మండలాల్లో వేలాది ఎకరాల్లో కాయగూరలు పంటలు నాశనం అయ్యాయి.. గత 45 రోజులుగా కాయగూరల పంటలు నీటిలో మునిగిపోవడంతో అక్కడి నుంచి కాయగూరల దిగుబడి దాదాపు నిలిచిపోయింది..జిల్లాలో అత్యధికంగా ఉల్లిసాగు చేసే గొల్లప్రోలు, పిఠాపురం ప్రాంతాల్లో ఉల్లిపంట కూడా పూర్తిగా నీట మునిగింది.. దీంతో రైతులు పూర్తిగా నష్టాల పాలయ్యారు..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న పంటలకు తోడుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కాయగూరలను అధిక ధరలకు విక్రయించాల్సి వస్తోందని రైతులు అంటున్నారు.. అయితే రైతు బజార్లలో ఈ పరిస్థితి ఉంటే.. బహిరంగ మార్కెట్లో అసలు కాయగూరలే దొరకని పరిస్థితి నెలకొంది.

ఈ సీజన్ లో కోనసీమ.. మెట్ట ప్రాంతాల్లో కాయగూరల పంటలు సాగు చేసే అవకాశం లేకపోవడంతో ..వచ్చే 2 నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందనేది తూర్పుగోదావరి జిల్లా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 

Tags:    

Similar News