Godavari River: గోదావరికి వరద పోటు.. 35 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
Godavari River: ఎగువ రాష్ట్రాల్లో వరదలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద నీటి ప్రవాహం పెరుగుతోంది.
Godavari River: ఎగువ రాష్ట్రాల్లో వరదలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. ఇది రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చడంతో దీని ఆధారంగా ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండుతున్నాయి. దీంతోపాటు వీటి మధ్య నుంచి రాకపోకలు సాగించే పలు గ్రామాలపై వరద ప్రభావం పడింది.
అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాలో కొన్నిచోట్ల భారీగా మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా కురుస్తున్నాయి. ప్రధానంగా ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ఏరోజుకారోజు వరద పెరిగి దిగువకు చేరుతుండటంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఆ ప్రభావం తీవ్రంగా పడింది. ఇప్పటికే 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ఎగువన 19 గ్రామాలకు, వేలేరుపాడులో మరో 16గ్రామాలకు రవాణా స్తంభించింది. గోదావరి వరదలకు శబరి కూడా తోడైంది. వేలేరుపాడు మండలంలో రెండ్రోజులుగా గ్రామాలు జలదిగ్బంధంలో ఉండగా ఇక్కడ సహాయ చర్యలు ఏమీ ప్రారంభం కాలేదు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. కోనసీమలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మన్యంలో శబరి, సీలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దేవీపట్నం మండలం తొయ్యేరు వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహస్థాయి మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా కొనసాగుతోంది. కోస్తాంధ్రలో ముసురు పట్టింది. నాలుగైదు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు, దక్షిణకోస్తాలో ఓ మోస్తరు జల్లులు పడుతున్నాయి. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఓ మోస్తరు, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు పడుతున్నాయి. మరో వైపు గోదావరి నదికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. కృష్ణా నదికి ఇప్పటికే వచ్చిన వరద నీటిని దిగువకు వదులుతున్నారు.