విశాఖలో తొలివిడత ఎన్నికలకు సర్వం సిద్ధం
* అనకాపల్లి నియోజకవర్గంలోని 12 మండలాల్లో పోలింగ్ * మొత్తం 2,960 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు * సాయంత్రం 3.30 గంటల వరకు పోలింగ్
విశాఖ జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు అధికారులు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేశారు. అనకాపల్లిలోని 12మండలాల్లో ఎన్నికలు జరగనుండగా మొత్తం 2వేల 960పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. సాయంత్రం 3గంటల 30నిమిషాల వరకు పోలింగ్ జరగనుండగా.. మూడు గంటల్లోనే ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో విశాఖ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు తెరపడనుంది.
ఇదిలా ఉంటే.. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆయా మండల కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. 304 బస్సులను ఉపయోగించి పోలింగ్ కేంద్రాల దగ్గరకు ఎన్నికల సిబ్బంది తరలించారు. ఎన్నికల సిబ్బందికి కొవిడ్ కిట్ల పంపిణీ, వైద్య సదుపాయం కోసం అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలింగ్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
మరోవైపు పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీస్ శాఖ పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసింది. సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించనున్నారు. ఇక ఎన్నికల సమయంలో ఎవరైనా ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.