Amaravati: అమరావతి కోసం రైతుల అలుపెరుగని పోరాటం
Amaravati: రాష్ట్ర రాజధాని కోసం దేశ రాజధానికి పయనం
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానికోసం రైతులు రాజీలేని పోరాటం చేస్తున్నారు. వారి రోధన అరణ్య రోధనే వారి ఆవేదన అంతులేని ఆవేధనే చేయని నిరసన లేదు చేయని పోరాటం లేదు. అలుపెరుగక నిరంతర శ్రామికులులా పోరాడుతున్నారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. వీరి పోరాటం మొదలుపెట్టి దాదాపు మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో మరోసారి ఢిల్లీ బాట పట్టారు. హస్తిన పెద్దలకు తమ గోడు చెప్పుకునేందుకు నడుం బిగించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూనే ఉన్నారు. కానీ సర్కారులో చలనం లేదు. రైతుల్లో సైతం ఆశలు సన్నగిల్లుతున్నాయి. కొన్ని నెలల క్రితం అమరావతి టూ తిరుమల పాదయాత్ర చేపట్టారు. దారి పొడవునా రైతుల సంఘీభావంతో యాత్రను సక్సెస్ చేశారు. అదే స్పూర్తితో అమరావతి టూ అరసవెళ్లి పాదయాత్ర మొదలుపెట్టారు. కానీ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వరకూ మాత్రమే యాత్ర నడిచింది. కోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో యాత్రకు బ్రేక్ పడింది. ఉత్తరాంధ్రలోకి ప్రవేశించి మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినదించాలనే రైతుల ఆలోచనకు గండిపడింది.
ఇప్పుడు తాజాగా మరోసారి అమరావతి రైతులు ఢిల్లీ బాటపట్టారు. ఈనెల 17న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపడానికి సిద్ధమయ్యారు. మూడు రోజుల పాటు హస్తినలో తిష్టవేసి కేంద్ర మంత్రులను, సహాయ మంత్రులను కలవనున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని కోరబోతున్నారు.