Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
Pawan Kalyan: రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యం
Pawan Kalyan: ఏపీలో గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. 4 వేల 976 కోట్లు నిధులతో 7వేల 213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయనే విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలన్నారు.
గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరదామని చెప్పారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమీక్షలో ఎ.ఐ.ఐ.బి అధికారులు ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్డు ప్రాజెక్టు గురించి పవన్ కళ్యాణ్‌కి వివరించారు. 250కి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రహదారుల నిర్మాణం సాధ్యపడుతుందని చెప్పారు. నెలకు 200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో అద్భుతమైన పురోగతి ఉంటుందని తెలిపారు. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి 75 కోట్ల మ్యాచింగ్ గ్రాంటు సమకూరిస్తే బ్యాంకు రూ.125 కోట్ల రుణం మంజూరు చేస్తుందన్నారు.
గత ప్రభుత్వం హయాంలో బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుబడిందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమస్యను పరిష్కరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యతతో కూడిన రహదారులు అందుబాటులోకి వచ్చేవని... తద్వారా గ్రామీణ అభివృద్ధి సాధ్యపడేదని పవన్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు ద్వారా రహదారుల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగేలా చూడాల్సిన బాధ్యత తీసుకుంటామని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో సమీక్షించేందుకు ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30 శాతం మ్యాచింగ్ గ్రాంటును 10 శాతానికి తగ్గించే విధంగా అవసరమైన మార్పులు చేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని కోరాతామని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.