Visakhapatnam: విశాఖలో కరోనా వైరస్ ఉధృతి
Visakhapatnam: పెరుగుతున్న పాజిటివిటీ రేటు...కొత్త కేసులు
Visakhapatnam: విశాఖలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. రోజు రోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తున్న వైరస్ కంగారు పుట్టిస్తోంది. వారం రోజుల్లో 195 కరోనా కేసులు నిర్థారణ కావడంతో కలకలం రేపుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
థర్డ్ వేవ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన సుమారు నాలుగు నెలలు తరువాత రోజువారీ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. గత వారం రోజుల్లో 195 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. విశాఖ జిల్లాలో ప్రస్తుతం కేసుల సంఖ్య కొంత తక్కువగా కనిపిస్తున్నప్పటికీ పాజిటివిటీ రేటు భారీగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
23న 9 శాతం పాజిటివిటీ రేటుతో 23 కేసులు
24న పాజిటివిటీ రేటు 15 శాతం.. 40 కేసులు
25న 12 శాతం పాజిటివిటీ రేటుతో 31 కేసులు
ప్రతిరోజూ సుమారు 300 మందికి పరీక్షలు
ఈ నెల 23న 9 శాతం పాజిటివిటీ రేటుతో 23 కేసులు నమోదు కాగా, ఈనెల 24న పాజిటివిటీ రేటు 15 శాతానికి పెరిగి 40 కేసులు నమోదయ్యాయి. 25 న 12 శాతం పాజిటివిటీ రేటుతో 31 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. గత మూడు నెలలు నుంచి పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగానే నమోదవుతూ వచ్చింది. ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజూ సుమారు 300 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచాల్సిందిగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
యాంటిబాడీలు తగ్గిపోవడంతో మరోసారి కోవిడ్
వైరస్ సోకిన వ్యక్తుల్లో స్వల్ప లక్షణాలు
జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు
కరోనా కేసులు పెరుగుతున్న తీరు నాలుగో వేవ్‌కు సంకేతంగా భావించాల్సిన అవసరం ఉందని వైద్యులు భావిస్తున్నారు. రెండో డోస్ తీసుకుని నెలలు దాటిన చాలామందిలో యాంటీబాడీలు తగ్గిపోవడంతో మరోసారి వైరస్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. వైరస్ సోకిన వ్యక్తుల్లో స్వల్ప లక్షణాలే ఉంటున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరస్ బారిన పడుతున్న వ్యక్తుల్లో జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని, జిల్లాలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ విజయలక్ష్మి చెబుతున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.