Coronavirus: అక్కడ వందల సంఖ్యలో వైద్యులు, సిబ్బంది పదుల సంఖ్యలో పర్యవేక్షకులు, కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా వసతులు ఇన్నీ ఉన్నా కరోనా వైరస్ సోకి అక్కడికి వెళ్తే బాధితుడు బతికి వస్తాడన్న నమ్మకం లేదు అక్కడ నిత్యం మరణ మృదంగం ఘోషిస్తోంది. ఇదేంటీ విడ్డూరం అనుకొంటున్నారా అవును మీరు వింటున్నది నిజం అక్షర సత్యం నెల్లూరు జిజిహెచ్ లో ఇది నిత్యకృత్యం. ఇంతకీ అక్కడేమి జరుగురుతోంది...? వైద్యులున్నా కరోనా బాధితులకు ఎందుకిలా జరుగుతోంది...?
నెల్లూరు ప్రభుత్వ భోదనాసుపత్రి సింపుల్ గా జీజీహెచ్ అని పిలుస్తుంటారు. విశాలమైన భవనాలు,, ఆధునిక వైద్యపరికారాలు వైద్యులు, సిబ్బంది ఉంటారు. అయినా పేషంట్లకు సరిగా వైద్యం అందని పరిస్థితి. తాజాగా కరోనా మహమ్మారి మరణ మృదంగాన్ని మోగిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కొవిడ్ వైరస్ నిండు ప్రాణాలను బలితీసుకుంటోంది. అన్నింటికి మించి వైరస్ సోకిన వారికి వ్యాధి పట్ల అధికారుల నిర్లక్ష్యం కరోనా బాధితులకు పెనుశాపంగా మారుతుంది.
నెల్లూరు సర్వజన ఆసుపత్రిలో చేరితే చావు ఖాయమన్నట్టుగా తయారైంది అక్కడి పరిస్థితి. కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన వారు విగతజీవులుగా అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. జిల్లాలో కరోనా వైరస్ భారీన పడి ఇప్పటి వరకు 186 మంది చనిపోయారు. సీనియర్ పాత్రికేయులను పొట్టనపెట్టుకుంది కరోనా మహమ్మారి. మనుబోలు మండలానికి చెందిన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ రమేష్ కన్నుమూశాడు.
తనకు కరోనా పాజిటివ్ సోకింది ఊపిరాడడం లేదు, వైద్య చికిత్సలు చేయండి అంటూ వేడుకున్నా ఆసుపత్రి సిబ్బంది, అధికారులు కనికరించలేదంచూ సెల్ఫీ వీడియో ద్వారా తన గోడును వెళ్లబోసుకున్నాడు. వందల సంఖ్యలో డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్,165కు పైగా వెంటిలేటర్లు పర్యవేక్షణ అధికారులు, ఇంత మంది వున్నా కరోనా బాధితులకు మాత్రం అక్కడ వైద్య సేవల్లో రిక్తహస్తమే చూపుతున్నారని బాధితులు వాపోతున్నారు.
కరోనా వార్డుల్లోకి పారిశుద్య సిబ్బంది మినహా మిగతా వారు వెళ్లడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం జీజీహెచ్‌లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడం పై ప్రత్యక దృష్టి సారించాలని కోరుతున్నారు. ప్రస్తుత అలసత్వం ఇలాగే కొనసాగితే కరోనా మహమ్మారికన్నా వైద్యం అందలేదన్న ఆందోళన వైరస్ సోకిన వారిలో ఎక్కువవుతుందని బాధితులు చెపుతున్నారు.