దుర్గమ్మ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వివాదాలు

Update: 2020-10-08 08:13 GMT

విజయవాడ దుర్గమ్మ ఆలయం భక్తులకు ఎంతో పవిత్ర స్థలం. కానీ ఈ మధ్య వివాదాలకు కేంద్రంగా మారింది. తరుచూ ఏదో ఒక వివాదం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తూనే ఉంది. అనుకోకుండా జరుగుతున్నాయా రాజకీయం చేస్తున్నారా కావాలనే చేస్తున్నారా కారణాలేవైనా భక్తుల మనోభావాలు మాత్రం దెబ్బతింటున్నాయి. కొన్నేళ్ల క్రితం అమ్మవారి కిరీటం మాయమైంది. ఆ తర్వాత అంతరాలయంలో తాంత్రిక పూజల వివాదం తెరపైకి వచ్చింది. ఇవన్నీ మరిచిపోయాక విలువైన చీర మాయమైంది. ఇప్పుడు రథంపై వెండి సింహాలు కనిపించకుండా పోయాయి. ఇలా వరుస ఘటనలు భక్తులను బాధిస్తూనే ఉన్నాయి.

1996లో అమ్మవారి విగ్రహానికి ఉన్న కిరీటాన్ని ఎవరో దుండగులు మాయం చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అమ్మవారి శిరస్సుపై కిరీటం దొంగిలించడం భక్తులు అపచారంగా భావించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సాహు అనే దొంగను పట్టుకొని కిరీటాన్ని రికవరీ చేశారు. తర్వాత ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజల ఘటన అప్పటి ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది. అర్ధరాత్రి సమయంలో పూజారి వేషంలో ఉన్న ఓ వ్యక్తి అమ్మవారి అంతరాలయం వద్ద నిలబడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అప్పటి ఈవో సూర్యకుమారి సహకారంతోనే ఆలయంలో తాంత్రిక పూజలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. 2018లో తాడేపల్లి ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు అమ్మవారికి సారే సమర్పించారు. అందులో ఖరీదైన పట్టుచీర ఉంది. కానీ అది సడన్ గా మాయమైంది. అప్పటి పాలకమండలిలో ఉన్న ఓ మహిళా సభ్యురాలు ఆ చీరను తీసుకెళ్లినట్లు తేలింది. దీంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకుంది. కానీ ఇంతవరకు మాయమైన చీర ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.

తాజాగా మూడు సింహాలు మాయం అవ్వడంతో రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. దొంగలు పడిన ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు ఆలయ అధికారులు హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు నాలుగు టీంలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై వివాదాలు కొత్తేమీ కాదు. అమ్మవారి సన్నిధిలో అక్రమాలు, అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవి కేవలం వెలుగు చూసిన ఘటనలు మాత్రమే ఇంకా బయటపడని బాగోతాలెన్ని ఉన్నాయి.

Tags:    

Similar News