Andhra Pradesh: విజయవాడ టీడీపీలో నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. పార్టీకి చెందిన నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా ఉన్న వర్గీయులంతా ఏకమై ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేశినేని నానితో గత కొన్ని రోజులుగా విసిగిపోయామని మండిపడ్డారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. తమ అధినేత చంద్రబాబును కేశినేని ఏక వచనంతో సంభోదించడం శోచనీయమని అన్నారు. తాను విజయవాడకే అధిష్ఠానం అని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు దురంహంకారాన్ని సూచిస్తున్నాయిన దుయ్యబట్టారు.
కేశినేని అహంకారాన్ని చూసి ఆరోజు తాను చెప్పుతో కొట్టాలనుకున్నానని బుద్దా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, చంద్రబాబు మీద ఉన్న గౌరవంతో ఆ పని చేయలేదని చెప్పారు. రంగా హత్య కేసులో ఉన్న ముద్దాయిని కేశినేని ప్రచారంలో తిప్పుతున్నారని విమర్శించారు. కేశినేని నాని స్థాయి దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే రా.. తేల్చుకుందాం అంటూ కేశినేనికి సవాల్ విసిరారు.
కేశినేని నానిపై టీడీపీ నేత నాగుల్ మీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని మాట్లాడే ప్రతిమాట కులహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. బడుగు, బలహీనవర్గాలను కించపరిచే విధంగా ఉందన్నారు. పశ్చిమంలో కేశినేని పెత్తనం ఏంటి అని ప్రశ్నించారు. పార్టీని నమ్ముకొని, పార్టీ కోసం పని చేసిన నాయకులం తామని చెప్పుకొచ్చారు. కేశినేని ఏకపక్ష ధోరణితో కార్యకర్తలు, నాయకులు విసిగిపోయారన్నారు.
ఎంపీ కేశినేని నాని ప్రవర్తన సరిగాలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం పనిచేస్తోంది తామని, పదవుల కోసం పనిచేస్తోంది కేశినేని నాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురుని మేయర్ చేయడం కోసం ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపారన్నారు. వర్గాలను, విభేదాలను కేశినేని ప్రోత్సహిస్తున్నాడన్నారు. నిజంగా బెజవాడ పార్లమెంట్‌లో కేశినేనికి సత్తా ఉంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలన్నారు.