Jagananna Thodu Pathakam: చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం
Jagananna Thodu Pathakam: రెండో విడత జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాన్ని సీఎం జగన్ ఇవ్వనున్నారు.
Jagananna Thodu Pathakam: ఒకవైపు కరోనా విరుచుకుపడుతున్నా ... మరోవైపు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాల అమలులో మాత్రం ఎక్కడా వెనకడుగు వేయటం లేదు. తన షెడ్యూల్ ప్రకారం తాను పథకాలను అమలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం రెండో దశను నేడు ప్రారంభించనున్నారు.
జగనన్న తోడు పథకం స్కీమ్ కింద ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున రూ.370 కోట్లను సీఎం వైఎస్ జగన్ జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వర్చువల్‌గా కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏటా జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేకుండా (సున్నా వడ్డీ) రూ.10 వేలు చొప్పున రుణాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 25న ఈ పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 5.35 లక్షల మంది లబ్ధిదారులకు సున్నా వడ్డీకే రూ.10 వేల చొప్పున రుణాలను అందించారు. రెండో విడతలో భాగంగా ప్రస్తుతం 3.70 లక్షల మందికి నగదు బదిలీ చేస్తున్నారు. దీంతో కలిపితే మొత్తం రాష్ట్రంలో 9.05 లక్షల మంది లబ్ధిదారులకు రూ.905 కోట్లను ఇచ్చినట్లు అవుతుంది.