తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. హెలికాప్టర్‌లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు.

Update: 2020-11-27 14:20 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. హెలికాప్టర్‌లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఏరియల్ సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమావేశమై తుఫాన్ నష్టంపై సమీక్షించనున్నారు. మంత్రివర్గ సమావేశంలోనూ తుఫాన్ నష్టంపై సీఎం జగన్ నిన్న చర్చించారు. డిసెంబర్ 15నాటికి పంట నష్టం అంచనాలు రూపొందించి డిసెంబర్ 30కల్లా రైతులకు పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటోన్న వరద బాధితులకు ఐదు వందల రూపాయల చొప్పున అందించాలని అధికారులకు సూచించారు.

అటు నివర్ తుఫాన్ ఏపీని గడగడలాడించింది. ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసింది. గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఊహించనిస్థాయిలో భారీ వర్షాలు కురిశాయి. దాంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు వాగులను తలపిస్తున్నాయి. ఇక, తిరుపతి, నెల్లూరు, కడపలో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. పెన్నా, కుందూ స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నివర్ తుపాను ప్రభావంతో పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. 

Tags:    

Similar News