నవంబర్ 22న హాజరుకావాలి:పవన్ కళ్యాణ్ కు హైద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు
తిరుపతి లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నవంబర్ 22న వ్యక్తిగతంగా హాజరుకావాలని నాంపల్లి సిటి సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పవన్ కళ్యాణ్ కు హైద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు సోమవారం సమన్లు పంపింది. ఈ ఏడాది నవంబర్ 22న వ్యక్తిగతంగా హజరు కావాలని ఆ నోటీసులో కోరింది. తిరుపతి లడ్డూ విషయంలో పవన్ వ్యాఖ్యలపై న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని పిటిషన్ చెప్పారు. ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియా, యూట్యూబ్ నుంచి తొలగించాలని ఆయన కోరారు.ఈ పిటిషన్ పై ఇవాళ కోర్టు విచారించింది.
పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే?
గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వరస్వామి దేవాలయంలో 11 రోజుల ప్రాయశ్చిత దీక్షను సెప్టెంబర్ 22న పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయం వెలుగు చూసిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలంరేపాయి. అయోధ్యకు తిరుపతి నుంచి పంపిన లక్ష లడ్డూలు కూడా జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితోనే తయారు చేసిన లడ్డూలను పంపారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.ఈ ఆరోపణలపై ఈ నెల 15న న్యాయవాది రామారావు నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించిన లడ్డూలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని సెప్టెంబర్ 18న చంద్రబాబు టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయంగా కలకలం రేపాయి. తిరుపతి పవిత్రతను దెబ్బతీసేలా వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవహరించిందని చంద్రబాబు ఆరోపించారు. ఈ ఆరోపణలను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు.ఈ విషయమై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది.