Cyclone Dana: వణికిస్తున్న దానా తుపాన్ .. గంటకు 120 కిమీ వేగంతో గాలులు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

Update: 2024-10-21 15:04 GMT

Cyclone Dana Latest News Updates: దానా తుపాన్ ప్రస్తుతం ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను వణికిస్తోంది. అయితే, ఈ తుపాన్ ప్రభావం ఏపీపై కూడా కొంతమేరకు ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు మంగళవారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒడిషా, పశ్చిమ బెంగాల్ దిశగా కదులుతున్న ఈ అల్పపీడనం ఈ నెల 24న వాయువ్య బంగాళాఖాతంలో తుపానుగా మారుతుందన్నారు. ఈ తుపాన్ ప్రభావంతో ఉత్తర కోస్తా, కోస్తాంధ్రలోని పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ స్పష్టంచేశారు.

వణుకుతున్న ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు

దానా తుపాన్ ప్రభావం ఏపీ కంటే ఒడిషాస పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై అధికంగా ఉండనుందని భారత వాతావరణ కేంద్రం స్పష్టంచేసింది. అక్టోబర్ 24 రాత్రి నుండి ఆ మరునాడు ఉదయం మధ్య ప్రాంతంలో ఈ దానా తుపాన్ ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య పూరి, సాగర్ దీవుల వద్ద తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 -120 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు ఎవ్వరూ చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఇదిలావుంటే, గత వారం వచ్చిన తుపాన్ తమిళనాడు తీర ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. ఈ తుపాన్ ప్రభావంతో మరోసారి నీట మునిగిన చెన్నై ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అనేక ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. తుపాన్ శాంతించినా.. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లలోకి వచ్చిన బురద నుండి జనం బయటపడేందుకు చాలా సమయమే పట్టింది. 

Tags:    

Similar News