Badvel News: ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి కేసులో నిందితుడి అరెస్ట్.. వెలుగులోకి కొత్త కోణం?

Update: 2024-10-20 15:52 GMT

Badvel News: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలుకు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పెట్రోల్ పోసి నిప్పటించి, ఆమె మృతికి కారకుడైన నిందితుడు విఘ్నేష్‌ని పోలీసులు కడప శివార్లలో అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు వెల్లడించిన వివరాల ప్రకారం ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నిందితుడు విఘ్నేష్‌కు, బాధితురాలికి మధ్య గత ఐదేళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ కూడా బద్వేలులోని రామాంజనేయ నగర్ కాలనీకి చెందిన వారే. ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. విఘ్నేష్ ఓ హోటల్లో కుక్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఇటీవలే మరో అమ్మాయితో పెళ్లయింది. ప్రస్తుతం అతడి భార్య గర్భంతో ఉంది. ఆ తరువాత కూడా ఇద్దరి మధ్య పరిచయం అలాగే కొనసాగినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తనని పెళ్లి చేసుకోవాలని ఈ అమ్మాయి వెంటపడుతోందని నిందితుడు చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు.

ప్లాన్ ప్రకారమే పెట్రోల్ బాటిల్‌తో..

తనకు పెళ్లయి, భార్య గర్భంతో ఉన్నప్పటికీ తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా మైనర్ బాలిక వెంటపడుతోందని, అందుకే ఆమెను అడ్డం తొలగించుకునేందుకే ఈ పని చేశానని నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తమ పరిచయం కొనసాగుతున్న క్రమంలోనే శనివారం ఇద్దరం కలుద్దాం అని విఘ్నేష్ ఫోన్ చేయడంతో అమ్మాయి కాలేజ్ ముగించుకుని అతడు చెప్పిన చోటుకు వెళ్ళారు. దారి మధ్యలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో కలుసుకున్నారు. అక్కడే కాసేపు సరదాగా గడిపిన తరువాత అమ్మాయి మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ఆగ్రహంతో పెట్రోల్ పోసి నిప్పంటించానని నిందితుడు అంగీకరించినట్లుగా పోలీసులు తెలిపారు.

బాధితురాలి మరణ వాంగ్మూలంలో ఏముంది?

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఇప్పుడు ప్రాణాలతో లేరు. చనిపోయే ముందు ఆమె ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా జిల్లా జడ్జి ఆమె వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె మృతికి కారకుడైన నిందితుడిగా చెబుతున్న విఘ్నేష్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఆమె తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంతం పెడుతుండటం వల్లే ఆమెని చంపాల్సి వచ్చిందని విఘ్నేష్ చెబుతున్నారు. కానీ అసలు ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది మాత్రం ఆమె జడ్జికి ఇచ్చిన మరణ వాంగ్మూలంలోనే ఉండే అవకాశం ఉంది.  

Tags:    

Similar News