Weather Report: ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు
AP Rains: ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
AP Rains: ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో మరో అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్‌లు చెబుతున్నాయి. బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ అల్పపీడనం వాయవ్య దిశగా వెళ్లి ఈ నెల 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, నంద్యాల, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, పార్వతీపురం మన్యం, విశాఖ, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, కోనసీమ, ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాలు, పల్నాడు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, కాకినాడ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వర్షాలకు బయటకు ఎవరు వెళ్లవద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పక బయటకు వెళ్లకూడదని తెలిపారు. వర్షాల సమయంలో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ఆ సమయంలో రైతులు పొలాల్లో ఉండవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదిలా ఉండగా మరోవైపు ఈ నెల 29న, వచ్చే నెల 3న కూడా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువగా ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి మృత్సకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ తెలిపింది.