అమలాపురంలో వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్యకేసు: పోలీసుల అదుపులో పినిపె శ్రీకాంత్..?
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు దుర్గాప్రసాద్ శ్రీకాంత్ కు అత్యంత సన్నిహితుడు. 2022 జూన్ 6న అయినవిల్లికి చెందిన వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ అదృశ్యమయ్యారు.దుర్గాప్రసాద్ కన్పించకుండా పోయిన తర్వాత కుటుంబ సభ్యులు అయినవిల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 2022, జూన్ 10న దుర్గాప్రసాద్ డెడ్ బాడీ కోటిపల్లి గోదావరి రేవు వద్ద లభ్యమైంది.
ఈ హత్య కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. మెడ ఎముక విరిచి హత్య చేసినట్టుగా పోస్టుమార్టం రిపోర్ట్ లో చెబుతోంది. అయితే ఇటీవలనే కార్మికశాఖ మంత్రి ఈ విషయమై డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కొత్తపేట డీఎస్పీ గోవిందరావు విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. మరణించిన దుర్గాప్రసాద్ స్నేహితుడు ధర్మేష్ ను పోలీసులు విచారించారు.
పోలీసుల అదుపులో ఉన్న ధర్మేష్ కోసం అతని కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీంతో అతడిని కోర్టులో హాజరుపర్చారు. మరోవైపు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ ను మధురైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
రాజకీయ కక్షతోనే తన కొడుకును ఈ కేసులో ఇరికించారని మాజీమంత్రి పి. విశ్వరూప్ చెప్పారు. రాజకీయాల కోసం తప్పుడు కేసులు బనాయించడం సరైంది కాదన్నారు.