ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణస్వీకారం.. మోడీ హాజరైయ్యే ఛాన్స్..
ఏపీలో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయం సాధించింది. వైసీపీకి కనీసం 20 సీట్లు కూడా దక్కకుండా కూటమి క్లీన్ స్వీప్ చేసింది.
Chandrababu Oath Ceremony: ఏపీలో టీడీపీ,బీజేపీ,జనసేన కూటమి తిరుగులేని విజయం సాధించడంతో.. చంద్రబాబు ప్రమాణస్వీకారంపై చర్చ ప్రారంభమైంది. ఫలితాలకు ముందు ఈ నెల 9న జగన్ ప్రమాణస్వీకారం ఉంటుందని వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున ప్రచారం చేయగా.. ఇప్పుడు అదే రోజున చంద్రబాబు ప్రమాణస్వీకారం ఉంటుందని టీడీపీ శ్రేణులు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం ఉంటుందని టీడీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
ఏపీలో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయం సాధించింది. వైసీపీకి కనీసం 20 సీట్లు కూడా దక్కకుండా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మెజార్టీ సర్వే సంస్థల అంచనాలను నిజం చేస్తూ కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ,కూటమి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని అంతా అనుకున్నా... ఫలితాలు మాత్రం ఏకపక్షంగానే వచ్చాయి. వైసీపీ ప్రచారంలో ఎంత ధీటుగా పోటీనిచ్చిందో ఆ స్థాయిలో ఫలితాలు రాబట్టడంలో చతికిలపడింది.
ఎన్డీఏ కూటమి ఘన విజయంతో చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమరావతిలోనే చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 9న విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం అంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేయగా...ఇప్పుడు అదే తేదీన చంద్రబాబు ప్రమాణస్వీకారణానికి ముహూర్తం ఫిక్స్ అవడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మోడీ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి మోడీ హాజరైయ్యే అవకాశం ఉంది. మోడీతో పాటు మరికొందరు కీలక ఎన్డీఏ నేతలు కూడా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరవుతారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. మొత్తంగా ఏపీలో ఎన్డీఏ కూటమి దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పనిచేయడంతో ఏపీ అసెంబ్లీ ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.