ఇవాళ పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం.12 గంటలకు ప్రాజెక్టు సందర్శన

CBN Polavaram Tour: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు.. రాష్ట్ర దశను మార్చే ప్రాజెక్టు. గత ప్రభుత్వ హయంలో ప్రాజెక్టు పురోగతి పూర్తిగా మందగించింది.

Update: 2024-06-17 03:23 GMT

ఇవాళ పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం.12 గంటలకు ప్రాజెక్టు సందర్శన

CBN Polavaram Tour: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు.. రాష్ట్ర దశను మార్చే ప్రాజెక్టు. గత ప్రభుత్వ హయంలో ప్రాజెక్టు పురోగతి పూర్తిగా మందగించింది. 2004 సంవత్సరంలోనే ప్రాజెక్టు ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి కేవలం కుడి, ఎడమ ప్రధాన కాల్వల నిర్మాణానికే ప్రాదాన్యత ఇచ్చారు. 2009 వరకు ప్రాజెక్టు పనులు జరగలేదు. ఆ తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు కొంత చొరవ తీసుకున్నా.. ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.

2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ పోలవరం ప్రాజెక్టు పనులను పరుగెత్తించింది. ప్రాజెక్టులో కీలకమైన అన్ని పనులను మొదలు పెట్టింది. 2019 నాటికి 72 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టులో అతి ముఖ్యమైన స్పిల్ వే, ఈసీఆర్‌యఫ్‌లకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా స్పిల్ వే పనులు చాలా వేగంగా సాగాయి. స్పిల్ వే నిర్మాణానికి అవసరమైన పునాదులను పియర్స్ స్థాయి నుంచి, క్లస్టర్ లెవెల్ వరకు అంటే 56 అడుగుల ఎత్తు వరకు నిర్మించింది. స్పిల్ వేకు అమర్చడానికి 48 గేట్ల నిర్మాణాన్ని బెకెమ్ సంస్థకు అప్పగించగా, కేవలం ఏడాది కాలంలోనే వాటిని తయారు చేసింది. దానిలో చంద్రబాబు హయాంలోనే ఒక గేటును స్పిల్‌వే అమర్చారు. అదే సమయంలో స్పిల్‌వే అప్రోచ్ ఛానల్ మట్టి, కాంక్రీట్ పనులను దాదాపు 30 శాతం పూర్తి చేసింది. అదేవిధంగా స్పిల్ ఛానల్ పనులను దాదాపు 90 శాతం పూర్తి చేసింది.

2017లో ప్రధాన ఈసీఆర్‌యఫ్ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డ్యాం నిర్మాణంలో కీలకమైన ఢయాఫ్రం వాల్ నిర్మాణాన్ని జర్మనీకి చెందిన బావర్ కంపెనీకి అప్పగించగా, కేవలం తొమ్మిది నెలల్లోనే ఆ పని పూర్తయ్యింది. తరువాత డయాఫ్రం వాల్ పై ప్రధాన డ్యామ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రధాన డ్యాం నిర్మించేటప్పుడు గోదావరి నదికి వరదల వలన పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాంల నిర్మాణాన్ని చేపట్టింది. ప్రధాన డ్యాంకు ఎగువన దాదాపు 1300 మీటర్ల పొడవున, 36 మీటర్ల ఎత్తున అప్పర్ కాపర్ డ్యాం పనులను పూర్తి చేసింది. మరో ఆరు వందల మీటర్ల మాత్రమే కట్టాల్సి ఉంది. అదే సమయంలో లోయర్ కాపర్ డ్యాం పనులను దాదాపు పూర్తి చేసింది.

2019లో వైసీపీ అధికారంలోకి రావండతో పోలవరం ప్రాజెక్టు మరుగున పడిపోయే స్థితికి చేరుకున్నాయి. అప్పటికే ప్రాజెక్టు పనులు చేస్తున్న నవయుగ సంస్థను మార్చి ఆ పనులను మెఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ చేపట్టిన పనులకు వైసీపీ సర్కార్ బిల్లులు చెల్లించకపోవడంతో.. పనులను పట్టించుకోలేదు. ఫలితంగా ఢయాఫ్రం వాల్ దెబ్బతింది. అప్పర్ కాపర్ డ్యాం పని కేవలం ఆరు వందల మీటర్లు మాత్రమే మిగిలి ఉండగా.. పూర్తి చేయలేకపోయింది. ప్రధాన డ్యాం పనుల వైపు వైసీపీ సర్కార్ కన్నెత్తి చూడలేదు. అదే సమయంలో అప్పర్ కాపర్ డ్యాం వైపు నుంచి స్పిల్ వే వైపు వరద నీటిని మళ్లించేందుకు 500 కోట్ల వ్యయంతో గైడ్ బండ్ ను నిర్మించారు. నిర్మాణ సమయంలో ఆ ప్రాంతంలో మట్టి నమూనాలను పరీక్షించకపోవడంతో రోజుల వ్యవధిలోనే గైడ్ బండ్ కుంగి పోయింది. ప్రాజెక్టు కు సంబంధించిన అనేక డిజైన్లు నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి.

వైసీపీ హాయంలో మందగించిన పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు. గత టీడీపీ హయాంలోనే పోలవరం నిర్మాణం పనులు పరుగులు పెట్టించిన చంద్రబాబు.. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుపై దృష్టిపెట్టారు. గతంలో లాగా సోమవారం- పోలవరం కార్యక్రమాన్ని కంటీన్యూ చేయబోతున్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 11.45 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు పోలవరం ప్రాజెక్టులోని వివిధ నిర్మాణ విభాగాలను పరిశీలించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. సీఎం పోలవరం పర్యటన నేపథ్యంలో.. అధికారులు అప్రమత్తం అయ్యారు.  

Tags:    

Similar News