సీఎం జగన్ కు సీబీఐ కోర్టు గుడ్ న్యూస్
CM Jagan: రాష్ట్రానికి పెట్టుబడుల తీసుకురావడమే లక్ష్యంగా సీఎం పర్యటన
CM Jagan: సీఎం జగన్ కు హైదరాబాద్ సీబీఐ కోర్టు గుడ్‌న్యూస్ చెప్పింది. దావోస్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 22న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు కోసం స్విట్జర్లాండ్ లోని దావోస్ వెళ్తున్నారు. ఐతే సీబీఐ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న సీఎం జగన్ దేశం విడిచివెళ్లరాదని గతంలోనే కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన శుక్రవారం కోర్టులో పిటిషన్ వేశారు. సీఎంగా అధికారిక పర్యటనకు దావోస్ వెళ్లేందుకు అనుమతివ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ న్యాయస్థానం జగన్ దావోస్ వెళ్లేందుకు అనుమతిచ్చింది. ఈ నెల 19వ తేదీ నుంచి 31వరకు విదేశీ పర్యటనకు వెళ్లొచ్చని కోర్టు స్పష్టం చేసింది. దీంతో సీఎం పర్యటనకు లైన్ క్లియర్ అయినట్లయింది.
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి హోదాలో సీఎం జగన్ తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 22 నుంచి 26వరకు స్విట్డర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు జగన్ నేతృత్వంలోని బృందం హాజరుకానుంది. రాష్ట్రానికి పెట్టుబడుల తీసుకురావడమే లక్ష్యంగా సీఎం పర్యటన ఉండబోతోంది. ఈ సదస్సులో సీఎం అధ్యక్షతన 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు, 35కి పైగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.
ప్రపంచ నలుమూలల నుంచి 2,200 మంది పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నాయకులు, ఆర్థికవేత్తలు సదస్సుకు హాజరవుతున్నారు. దావోస్ పర్యటనలో సీఎం జగన్ ప్రధానంగా 3 కీలక సమావేశాలలో భాగస్వామ్యం కానున్నారు. 23న వైద్యరంగంపై కీలక సమావేశం నిర్వహిస్తారు. 24న విద్య, నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్ నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ పీవీ మిథున్ రెడ్డి, APIIC ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు దావోస్ వెళ్తున్నారు.