ఆ పార్టీలో ఏపీ అధ్యక్షుడిగా ఎంపికైన ఒక లీడర్ పరిస్థితి గందరగోళంగా తయారైందట. తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందేనని పార్టీ అధినేతను పిలుస్తుంటే, ఆయన ససేమిరా అని మారాం చేస్తున్నారట. దీంతో ఆ అధినేత తీరుపై రాజకీయ ప్రత్యర్ధులు విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే అసలు తమ పార్టీలో ఏం జరుగుతోందో తెలియక, పార్టీ శ్రేణులు ఆకాశంలో చూస్తూ ఆలోచనలో పడుతున్నారట. ఎవరా నేత...? ఏంటా పార్టీ ..? ఏమా కథ...?
ఇటీవలే టిడిపి ఏపీ అధ్యక్షుడిగా ఎంపికైన అచ్చెన్నాయుడుకు కొత్త సమస్య వచ్చి పడిందట. తనను పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడో ఎంపిక చేసినా, అధికారిక ప్రకటన చేసేందుకు నెలల తరబడి సమయం పట్టిన నేపథ్యంలో, ఒకింత అసంతృప్తికి గురైన అచ్చెన్నాయుడు, ఇప్పుడు మరింత అసహనంతో ఉన్నారట. నెలరోజుల క్రితమే తనను అధ్యక్షుడిగా నియమించినప్పటికీ, ఇప్పటికీ ఆయన బాధ్యతలు చేపట్టలేదు. మొన్నటివరకూ మంచి రోజుల కోసం వేచిచూసిన అచ్చెన్నాయుడు, ఇప్పుడు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని చంద్రబాబు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారట. దీంతో ఇంకా తెలవారదేమీ, ఈ చీకటి విడిపోదేమీ అన్నట్లుగా ఉందట సదరు అచ్చెన్న పరిస్థితి.
అయితే అబ్బాయ్ రామ్మోహన్ నాయుడును కాదని, బాబాయ్ అచ్చెన్నాయుడికే పగ్గాలప్పజెప్పిన చంద్రబాబు అచ్చెన్న ప్రమాణస్వీకారానికి ఎందుకు హాజరుకావటం లేదని ఆరాతీస్తే, ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకు వస్తోంది. కరోనా ఉధృతి ఇంకా తగ్గలేదు వయసు రీత్యా, డాక్టర్ల సలహా మేరకు తాను కూడా జూమ్ మీటింగులకే పరిమితమవుతున్నారు. మరి, ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాణస్వీకారానికి హాజరైతే, సుమారు 300 నుండి 400 మంది ప్రతినిధులు తరలివస్తే, ఇబ్బంది కదా అని భావిస్తున్నారట బాబు. దీంతో తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని, అచ్చెన్నాయుడు ముచ్చటపడి అడుగుతున్నా చంద్రబాబు నో అంటున్నారట.
దీంతో కరోనా భయంతో భారీ ఎత్తున ప్రమాణస్వీకార కార్యక్రమాలు వద్దని ఓవైపు అధినేత చెబుతుంటే, మరోవైపు రాజకీయ ప్రత్యర్ధులు ఈ వ్యవహారంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి అయితే, ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేసి హీట్ రాజేస్తున్నారు. అచ్చెన్న ప్రమాణస్వీకారానికి రానని బాబు చీదరించుకుంటున్నారంటూ, సాయిరెడ్డి పేల్చిన ట్వీట్ బాంబు శకలాలు, ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో పడ్డాయట. కనీసం పార్టీ ఆఫీసులో ప్రోగ్రాం పెట్టుకోవటానికి నో అని చెప్పటం, బీసీలను అవమానించటం కాదా అని సాయిరెడ్డి ప్రశ్నించటంతో...ఏంటీ..? ఇదంతా నిజమేనా అని పార్టీ క్యాడర్ ఆందోళనతో కూడిన ఆలోచనలో పడుతోందట. అసలేం జరుగుతోందో మాకు కూడా తెలియాలంటూ సో కాల్డ్ సీనియర్లు సైతం తెగ ఇదైపోతున్నారట.
మొత్తానికి అచ్చెన్న అధ్యక్షుడిగా ఎంపిక కావటం ఒక ఎత్తయితే, ఆయన బాధ్యతల స్వీకార కార్యక్రమం ఒక ఎత్తన్నట్లు తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఓవైపు అధినేత సమక్షంలో ఘనంగా బాధ్యతలు చేపడదామనుకుంటే, కరోనా పేరు చెప్పి ఆయన కట్ చేస్తే మరోవైపు ఇదే సందని ప్రత్యర్థులు ట్వీట్లతో మసాలా జోడించి, గిల్లే ప్రయత్నాలు చేయటం పాపం అచ్చెన్నకు ఇబ్బందిగా మారిందట. సో తాజా పరిస్థితుల నేపథ్యంలో తూతూమంత్రంగా బాధ్యతల స్వీకార కార్యక్రమం పూర్తిచేసి, పనిలో పడదామని చూస్తున్నారట అచ్చెన్న. మరి ఇప్పుడే ఇన్ని అడ్డంకులెందురవుతోంటే ఇక బలంగా ఉన్న వైసీపీపై పోరాడేందుకు పార్టీవైపు నుంచి సహకారం ఎంతమాత్రం ఉంటుందోనన్న కొత్త చర్చ కూడా షురూ అయిందట. మరి వీటన్నింటినీ దాటుకుని అచ్చెన్న ఎలా పోరాడతారో చూడాలి.