AP Transport Department: కరోనా నేపథ్యంలో ఏపీ రవాణ శాఖ కీలక నిర్ణయం
AP Transport Department: మోటారు వాహన పన్ను చెల్లింపు గడువును ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
AP Transport Department: రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గంటకు సగటున 411 మంది వైరస్ బారిన పడుతుండగా... ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ వాహనదారులకు ఊరట కలిగేలా నిర్ణయం తీసుకుంది. మోటారు వాహన పన్ను చెల్లింపు గడువును ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రస్తుత త్రైమాసిక పన్నును ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించాల్సి ఉంది. అయితే.. కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో పన్ను చెల్లింపు గడువును పొడిగించాలని లారీ యజమానుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. వీరి వినతి పట్ల సానుకులంగా స్పందించిన సర్కార్ పన్ను చెల్లింపు గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టీ కన్నబాబు సోమవారం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు.
కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రవాణ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి మే నెల చివరి వరకు రవాణా శాఖ కార్యాలయాల్లో ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లను నిలిపివేసింది. ఈ మేరకు రవాణ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తేదీల్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి జూన్ 1 వ తేదీ తర్వాత వేరే తేదీల్లో అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.
ప్రభుత్వం తీసకున్న నిర్ణయంతో లారీ యజమానుల సంఘం సంతోషం వ్యక్తం చేసింది. వాస్తవానికి వెహికల్ టాక్స్ అడ్వాన్స్ గా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ మూడు నెలలు ఒక సారి ఈ చెల్లింపులు ఉంటాయి. గడువులోగా వెహికిల్ ట్యాక్స్ చెల్లించని పక్షంలో భారీగా జరిమానా విధిస్తారు. అయితే ప్రభుత్వం గడువు పొడిగించడంతో ఎలాంటి ఫైన్ లేకుండానే వారు రెండు నెలల తర్వాత పన్ను చెల్లించే అవకాశం ఏర్పడింది.