AP Municipal Elections: ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుండగా అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు ఓటర్లు.
Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుండగా అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు ఓటర్లు.
మొత్తం 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు ఉండగా గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల చిత్తూరు జిల్లా పుంగనూరు కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 71 మున్సిపాలిటీలకు ఎన్నిక జరగనుంది. అటు 12 కార్పొరేషన్లలో 671 డివిజన్లు ఉండగా 89 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 582 డివిజన్లకు పోలింగ్ జరగనుంది. రాష్ర్ట వ్యాప్తంగా 78 లక్షల 71 వేల 272 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
పోలింగ్ కేంద్రాల్లో కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తుకు పోలీసుశాఖ ఏర్పాట్లు చేసింది. ఎన్నికల సామాగ్రిని ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలకే చేరవేశారు. మున్సిపల్ కార్పేరేషన్, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో సగానికిపైగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నందున భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 వేల 320 అత్యంత సమస్యాత్మక, 2 వేల 468 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు పోలీసులు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసి ఎన్నికలలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
సందిగ్ధత నెలకొన్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్‌లో కూడా ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. అయితే ఫలితాలను మాత్రం నిలిపేయాలని ఆదేశించింది. అటు గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీలో కూడా పోలింగ్ నిర్వహించాలని ఫలితాలను ప్రకటించవద్దని తెలిపింది హైకోర్టు. ఈ రెండు స్థానాలు మినహా 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల ఫలితాలను ఈనెల 14న వెల్లడించనున్నారు.