Jagan Tour: ఇవాళ తిరుమలకు ఏపీ సీఎం జగన్
*శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం జగన్ *శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
Jagan Tour: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏపీ సీఎం జగన్ ఇవాళ, రేపు తిరుమలలో సందర్శించనున్నారు. ప్రభుత్వం తరుపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుమలకు వెళ్లనున్నారు. 3గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. 3.30 గంటలకు తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రిని ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకుని మెట్ల మార్గాన్ని, గో మందిరాన్ని ప్రారంభిస్తారు. టీటీడీ గోపూజను గోవు ప్రాశస్త్యాన్ని మరింతగా విస్తృత పరచడంలో భాగంగా అలిపిరి వద్ద దాతల సహకారంతో గోపూజా మందిరాన్ని ఏర్పాటు చేసింది. అలాగే రియలన్స్ సంస్థ సహకారంతో అలిపిరి కాలిబాట మార్గంలో రూఫ్ ను ఆధునీకరించారు. అక్కడి నుంచి బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని శ్రీవారికి పట్టువస్త్రాలు తీసుకుని ఆలయంలో స్వామివారికి సమర్పిస్తారు.
సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకవైపు బ్రహ్మోత్సవాలు మరోవైపు సీఎం పర్యటనతో తిరుమల ఘాట్ రోడ్డును పోలీసులు జల్లెడ పడుతున్నారు. రేపు ఉదయం విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మహద్వారం ఎదురుగా ఉన్న గొల్లమండపం వద్ద ఎస్వీబీసీ కన్నడ/హిందీ ఛానళ్లు ఆవిష్కరిస్తారు. దాంతో పాటు కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసి అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్.