Janata Curfew: కరోనాపై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు
ఏపీలో మూడు కరోనా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. పాజిటివ్ కేసులు నమోదైన వారి ఇంటికి సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు తీవ్ర స్థాయిలో పారిశుధ్య పనులు చేసి, మిగతా వారికి వైరస్ సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా తీవ్ర రూపం దాల్చిన దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని నేరుగా ఆస్పత్రుల్లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించి, 14 రోజుల తర్వాత పరీక్షలు నిర్వహించి ఇళ్లకు పంపిస్తున్నారు. వైరస్ కట్టడిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా వ్యాప్తి నివారణా చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ సూచించిన ప్రకారం ఆదివారం రోజు 'జనతా కర్ఫ్యూ'కు సంఘీభావం ప్రకటిద్దామని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ ప్రకటన విడుదల చేశారు. మార్చి 22న ప్రజలంతా స్వచ్ఛందంగా 'జనతా కర్ఫ్యూ' పాటించాలని సీఎం కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.