AP CM YS Jagan Kadapa Visit Today: నేడు కడపకు సీఎం జగన్

AP CM YS Jagan Kadapa Visit Today: ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి కడప పర్యటన ఖరారయ్యింది.

Update: 2020-07-07 02:00 GMT
YS Jagan (File Photo)

AP CM YS Jagan Kadapa Visit Today: ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి కడప పర్యటన ఖరారయ్యింది. ఈ రోజు తాడేపల్లి నుంచి బయలుదేరి కడప నుంచి ఇడుపులపాయ వెళ్లనున్నారు. రేపు తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. దీంతో పాటు కడపలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేలా ఖరారు చేశారు. అయితే ఈ పర్యటనలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా భద్రతా ఏర్పాట్ల విషయమై పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు. పూర్తిస్తాయిలో కరోనా టెస్ట్ చేసుకున్న వారినే అనుమతించేలా ఏర్పాట్లు చేశారు.

నేడు, రేపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకొని పులివెందుల పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఐఎస్‌డబ్ల్యూ శ్రీనివాసులుతో కలసి ఎస్టేట్‌లోని హెలీప్యాడ్, వైఎస్సార్‌ ఘాట్, ట్రిపుల్‌ ఐటీలో వైఎస్సార్‌ స్మారక విగ్రహం, ఇంజినీరింగ్‌ డిపార్టుమెంట్‌ తరగతి గదులు, ల్యాబ్‌లను పరిశీలించి అవసరమైన గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ అన్బురాజన్‌ మాట్లాడుతూ కోవిడ్‌–19 నేపథ్యంలో స్టాండర్డ్‌ ఆపరేషనల్‌ ప్రోటోకాల్‌(ఎస్‌ఓపీ) తప్పనిసరిగా పాటించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు హాజరయ్యే ప్రతి ఒక్కరికి కోవిడ్‌–19 త్రోట్‌ స్వాబ్‌ టెస్ట్‌ చేయించుకున్నవారికే అనుమతించాలని ఆదేశాలు జారీచేశారు.

హెలీప్యాడ్‌ వద్ద రోడ్డుకు ఇరువైపుల బారికేడ్‌లు ఏర్పాటు చేసి అక్కడ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు 36 మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. వైఎస్సార్‌ ఘాట్‌కు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, వీఐపీలకే అనుమతించాలన్నారు. ట్రిపుల్‌ ఐటీలో వైఎస్సార్‌ స్మారక విగ్రహ ఆవిష్కరణ, ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ తరగతి గదుల ప్రారంభోత్సవంతోపాటు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనకు 60 మంది ట్రిపుల్‌ ఐటీ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా ఇంజినీరింగ్‌ డిపార్టుమెంట్‌ హెచ్‌ఓడీలు, విద్యార్థులు మాత్రమే ఉండాలన్నారు. బయటనుండి వచ్చిన వారికి ఎలాంటి అనుమతి ఉండదన్నారు. వీరన్నగట్టుపల్లె క్రాస్‌నుండి ఏడు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి చెక్‌చేసి పంపడం జరుగుతుందన్నారు. ఈ ఏర్పాట్లన్ని పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌ ఆధ్వర్యంలో పకడ్బందీగా చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 7వతేదీ మంగళవారం సాయంత్రం 4.55 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న , వేంపల్లె సీఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి తదితర పోలీస్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News