ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. ఇళ్ల స్థలాల పంపిణీ, భూ సమగ్ర సర్వేపై చర్చ

ఈనెల 30న.. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందజేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిపై కేబినెట్‌ అధికారికంగా ఆమోద ముద్ర వేయనుంది.

Update: 2020-12-18 05:15 GMT

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ, భూ సమగ్ర సర్వేపై కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో నూతన పర్యాటక విధానంపై చర్చించి ఆమోదం తెలపనుంది. మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. సర్వే, బౌండరీ చట్ట సవరణ పైన చర్చించనుంది. తిరుపతిలో ల్యాడ్ సర్వే అకాడెమీ ఏర్పాటుతో పాటు 40 ఎకరాల భూ కేటాయింపు అంశంపై కేబినెట్‌లో చర్చించనున్నారు.

ఇక ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ.. అదేరోజు ఇంటి నిర్మాణాల కార్యక్రమం ప్రారంభించాలని ఇదివరకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ప్రతీ జిల్లాలో పండుగ తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా భూ సమగ్ర సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండు కార్యక్రమాలపై మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు సీఎం జగన్.

ఈనెల 30న.. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందజేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిపై కేబినెట్‌ అధికారికంగా ఆమోద ముద్ర వేయనుంది. ప్రధానంగా సంక్రాంతి నుండి ముఖ్యమంత్రి జగన్ రచ్చబండ నిర్వహించాలని తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనుకుంటున్నారు.

పోలవరం సందర్శించిన సీఎం జగన్.. ప్రాజెక్టు దగ్గర ఉన్న వాస్తవ పరిస్థితులను మంత్రులకు వివరించడంతోపాటు.. కేంద్ర ఆలోచనలు ఏంటనేది మంత్రులకు తెలియజేసే అవకాశం ఉండనుంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా కరోనా సెకండ్ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహణపై చర్చించనున్నారు.

Tags:    

Similar News