రాగల 24గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండురోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన కారణంగా తీరం వెంబడి గంటకు 45నుంచి 55కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా రాయలసీమలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఇక తెలంగాణలోనూ రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.