ఎస్‌ఈసీ, ప్రభుత్వం మధ్య వివాదంతో రసవత్తరంగా మారిన ఏపీ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవాలంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనతో మరింత రంజుగా మారాయి. విపక్షాలకు చెక్ పెట్టేందుకు ఏకగ్రీవ వ్యూహం అమలు చేసింది వైసీపీ. భారీగా ప్రోత్సాహకాలు కూడా ప్రకటించడంతో.. అందరి చూపు ఏకగ్రీవాలపై పడింది. అయితే తొలి విడత ఎన్నికలకు దాఖలైన నామినేషన్లు చూస్తే.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. దీంతో అధిష్టానం ఏకగ్రీవాలపై మరింత దృష్టి సారించింది.
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ వ్యూహం అమలు చేస్తుంది వైసీపీ. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఫోకస్ పెట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే వైసీపీ ఆశించిన మేర ఏకగ్రీవాలు అవ్వడం లేదు. ఏకగ్రీవాలు అవ్వకుండా టీడీపీ, బీజేపీ జనసేన బలపరిచిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల రాజకీయం రసవత్తరంగా మారింది.
మొదటి విడతలో 3 వేల 249 పంచాయతీ లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో సింగిల్ నామినేషన్ లు కేవలం 93 మాత్రమే ఉన్నాయి. నామినేషన్ ఉపసంహరణ సమయానికి కొన్ని పెరిగినా ఆశించిన స్థాయిలో ఏకగ్రీవాలు లేవని వైసీపీ అధిష్టానం భావిస్తుంది ఇప్పటికే ఏకగ్రీవాలు చెయ్యాలని ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇచ్చినా ప్రభుత్వం తరపున ప్రోత్సహకాలు ఇచ్చినా అంతగా వర్క్ ఔట్ అవ్వడం లేదు. దీంతో వైసీపీ అధిష్టానం అలెర్ట్ అయ్యింది.
మొదటి విడతలో తక్కువ ఏకగ్రీవాలు అయినా మిగిలిన మూడు విడతల్లో ఆ శాతం పెరగాలని నేతలకు పార్టీ అధిష్టానం నేతలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఏకగ్రీవాలు చేసే బాధ్యతలు ఎమ్మెల్యేలతో పాటు స్థానిక మంత్రులు, ఇంఛార్జ్ మంత్రులకు అప్పగించారని సమాచారం. వీరితో పాటు పార్టీ ఇంచార్జ్ లు సజ్జల, వైవి, సాయిరెడ్డి, మోపిదేవి, వేంరెడ్డిలకు కూడా ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది.
పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఇప్పటికే మంత్రులు రంగంలోకి దిగిపోయారు. గ్రామాల వారీగా సమీక్షలు చేస్తూ ఏకగ్రీవాలపై ఫోకస్ పెట్టారు. మరి మిగిలిన విడతాల్లో అయినా ఆశించిన మేర ఫలితాలు వస్తాయో లేదో చూడాలి.