Operation Muskaan in AP: ఏపీలో 'ఆపరేషన్ ముస్కాన్' మళ్లీ స్పీడప్
Operation Muskaan in AP: పిల్లలను సన్మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతో ఆపరేషన్ ముస్కాన్ ప్రతి ఏడాది గట్టిగా అమలు చేస్తారు.
Operation Muskan in AP: మనం క్రిమినల్స్ రికార్డులు తిరగేస్తే.. వారిలో ఎక్కువమంది అనాథలు, లేదంటే ఇంట్లోంచి చిన్నప్పుడే పారిపోయి వచ్చేసినవారు ఉంటారు. వీరికి ఎదగడానిక వేరే అవకాశం లేక.. తిండికి కూడా ఎదురు చూస్తూంటారు. మాఫియా ఇలాంటివారినే టార్గెట్ చేసి.. వారికి ట్రయినింగ్ ఇచ్చి క్రిమినల్స్ గా మార్చి సమాజంపైకి ఉసిగొల్పుతుంది. నేరస్తుడిని పట్టుకోవడం కంటే.. నేరాన్ని నియత్రించడమే కరెక్టనే కాన్సెప్టును ఫాలో అయ్యే డీజీపీ గౌతమ్ సవాంగ్.. పిల్లలను నేరస్తులుగా మారకముందే.. వారిని సన్మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతో నడిపే ఆపరేషన్ ముస్కాన్ ప్రతి ఏడాది గట్టిగా అమలు చేస్తారు.
రాష్ట్రంలోని జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండులలో ఈ 'ఆపరేషన్ ముస్కాన్' కొనసాగుతోంది. బాల కార్మికులు, 14 సంవత్సరం లోపు వీధి బాలలకు విముక్తి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఐసిడిఎస్, ఎన్జీఓలు ,వివిధ శాఖల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఆపరేషన్ ముస్కాన్ లో అనాథలైన పిల్లలను, బాల నేరస్తులను గుర్తించి వారిని వారి వారి తల్లిదండ్రుల వద్దకు లేదా ఎన్జీవో హోమ్స్ కు తరలించే పనిని చేపడతారు. దీని కోసం ఆయా పిల్లలకు కౌన్సెలింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పుడున్న కరోనా పరిస్ధితుల్లో ఇది కష్టమని అనుకోవచ్చు. కాని డీజీపీ గౌతమ్ సవాంగ్ కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించాలంటూ అందుకవసరమైన గైడ్ లైన్స్ రూపొందించారు.
అలా ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ ముస్కాన్‌ను మళ్లీ వేగవంతం చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఆపరేషన్ ముస్కాన్‌ను చేపట్టారు. పోలీసులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, హోటళ్లు, దాబాలు, ఇటుక బట్టీలు, ఆటో గ్యారేజ్‌లను పోలీసులు జల్లెడ పడుతున్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం వీధి బాలల కోసం 'ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్ 19' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా తప్పిపోయిన బాలబాలికలు, బాల కార్మికులు, అనాథ పిల్లలను గుర్తించి.. వారిని తల్లిదండ్రుల వద్దకు, అనాథలను పునరావాస కేంద్రాలకు తరలిస్తారు.