Coronavirus treatment under Aarogyasri : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి గురించి భయపడుతున్న వారికి భరోసా ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాటు, ప్రైవేట్ ఆస్పత్రుల సేవలు కూడా తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి పలుసూచనలు చేసింది.
ప్రాణాంతక కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. కరోనా బారిన పడిన వారికి అందించే వైద్యంతో పాటు ఆ లక్షణాలు కనిపించిన వారికి నిర్వహించే పరీక్షలను కూడా దీని కిందికి తీసుకొచ్చింది. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతం కావడం, పేషెంట్లకు మెరుగైన చికిత్సను అందించడం, చాలినన్ని పడకలను ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
కరోనా బారిన పడిన పేషెంట్‌కు అందించే ట్రీట్‌మెంట్‌కు ఏ స్థాయిలో ఎంత మొత్తాన్ని వసూలు చేయాలో స్పష్టం చేశారు. ఇకపై ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులన్నింటిలోనూ కరోనా పేషెంట్లకు వైద్యాన్ని అందిస్తారని జీవోలో వెల్లడించారు. తాము నిర్ణయించిన మొత్తానికి లోబడి పేషెంట్ల నుంచి ఫీజులను వసూలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం అదేశించింది.
నాన్ క్రిటికల్ కరోనా చికత్సకు రోజుకు 3,250 రూపాయలు, క్రిటికల్ పేషెంట్లకు ఐసీయూలో అందించే చికిత్స కోసం ఆక్సిజన్ సరఫరాతో కలిపి అందించే చికిత్సకు రోజుకు 5,980 రూపాయలు నిర్ధారించారు. ఐసీయూలో వెంటిలేటర్‌తో అందించే చికిత్స కోసం రోజుకు 9,580 రూపాయలు నిర్ధారించారు. వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్సకు రోజుకు 5,480 రూపాయలు, ఐసీయూలో క్రిటికల్ కేర్ చికిత్సకు 10,380, వెంటిలేటర్ లేకుండా చికిత్సకు రోజుకు 6,280 రూపాయలు ఖరారు చేశారు.
కరోనా పేషెంట్లకు మరింత నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా రోగులకు ట్రీట్‌మెంట్‌ను అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులను కరోనా పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటిని మూడు కేటగిరీలుగా మార్చాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది. దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.