Atchannaidu: టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. రూ. 2 లక్షలు షూరిటీ ఇవ్వాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లవద్దని, సాక్షులను తారుమారు చేయవద్దని, దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది.
ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందుల కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించిన కేసులో అప్పటి కార్మికశాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుణ్ని నిమ్మాడలోని తన నివాసంలో జూన్ 12న అనిశా అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన అచ్చెన్నాయుడు, 70 రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు. కాగా, అచ్చెన్నాయుడు ప్రస్తుతం కరోనాతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక బెయిల్ కోసం అచ్చెన్నాయుడు గతంలో రెండుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమవడం తెలిసిన విషయమే.