Amaravati: లీజుకు అమరావతి భవనాలు..!
Amaravati: గ్రూప్-డి ఉద్యోగుల భవనాలు లీజుకు ఇచ్చే అవకాశం
Amaravati: నిధుల సమీకరణ కోసం ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలోని భూములను విక్రయించాలని నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతిలోని భవనాలను లీజుకి ఇవ్వాలని డెసిషన్ తీసుకుంది. రాజధాని పరిధిలో పూర్తైన భవనాలను లీజుకివ్వాలని సీఆర్డీఏ ప్రతిపాదనలు చేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్యోగుల కోసం నిర్మించిన గ్రూప్ డి భవనాలను లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్‌డీఏ చేసిన ప్రతిపాదనకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు.
విట్ యునివర్సిటీకి ఒక భవనాన్ని లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఏడాదికి 10కోట్ల రూపాయల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోంది. భవిష్యత్తులో మిగతా టవర్లను లీజుకు తీసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే.. వారికి లీజుకు ఇచ్చే యోచనలో సీఆర్‌డీఏ ఉన్నట్టు తెలుస్తోంది. గ్రూప్-డి ఉద్యోగుల కోసం 7.76 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 6 టవర్లను సీఆర్‌డీఏ నిర్మించింది. ఒక్కోదానిలో 120 చొప్పున మొత్తం 720 ఫ్లాట్లు ఉన్నాయి. 65 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మొత్తం 10 లక్షల 22వేల 149 చదరపు అడుగుల సూపర్ బిల్డ్ ఏరియా విస్తీర్ణం.
ఇదిలా ఉంటే భూముల అమ్మకానికి, లీజుకు తాము అంగీకరించేది లేదని అమరావతి రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రాజధానిపై ప్రభుత్వం ఇంకా కుట్రపూరితంగానే వ్యవహరిస్తోందని రైతులు విమర్శిస్తున్నారు. ఈ చర్యలు కోర్టు తీర్పుల ఉల్లంఘనే అని మండిపడుతున్నారు.