Alluri Sitarama Raju: మన్యంలో అమాయకులకోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు
Alluri Sitarama Raju: ప్రజల ఆరాధ్యదైవంగా అల్లూరి సీతారామరాజు
Alluri Sitarama Raju: సమరనాదానికి రూపం విప్లవ నినాదానికి ఆయువు బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన అగ్గిపిడుగు త్యాగానికి నిలువెత్తు నిదర్శనం అల్లూరి సీతారామరాజు. మన్నెం ప్రజల మనస్సులో దైవంలా నిలిచిన అల్లూరి జీవితం ఇప్పటికీ ఎప్పటికీ స్ఫూర్తి దాయకమే. పుట్టింది ఒకచోట ఎదిగింది మరోచోట అయినా ఆయన అమాయకప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కంకణం కట్టుకున్నారు. ప్రజాసైన్యంతో తిరగబడి బ్రిటీషు పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేశారు. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి జనంగుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.
అల్లూరి సీతారామరాజు 1897 జులై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు. అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. రామరాజు తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి సంస్కృతం, జోతిష్యశాస్త్రం, జాతక శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారు. 1917లో విశాఖపట్నం జిల్లా క్రిష్ణదేవీపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు. మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి, బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని మన్యం ప్రజలను పురిగొల్పారు. సీతారామరాజు ప్రధాన అనుచరుడు, సేనాని గాం గంటందొర. ఈయనది నడింపాలెం గ్రామం.
మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చేయాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, యుద్ధంలో మెళకువలు నేర్పించి పోరాటానికి సిద్ధంచేశాడు.
చింతపల్లి1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపివేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. మొత్తం 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్ళు, 14 బాయొనెట్లు తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి, రాజు సంతకం చేసాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. తిరిగి వెళ్ళేటపుడు, మరో ఇద్దరు పోలీసులు కూడా ఎదురుపడ్డారు. వారి వద్దనున్న ఆయుధాలను కూడా లాక్కువెళ్లారు.
బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ప్రజలను కాల్చుకు తినడం మొదలుపెట్టింది. ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాలను చూడలేని రాజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. 1924 మే 7న విశాఖపట్నం జిల్లా మంప గ్రామానికి సమీపాన రాజు స్వయంగా లొంగిపోయారు. సీతారామరాజుపై పగతో రగిలిపోతున్న బ్రిటిష్ అధికారులు ఆయన్ని చింతచెట్టుకు కట్టి కాల్చిచంపారు. మే 8న రాజు అనుచరులు ఆయన భౌతికకాయాన్ని క్రిష్ణదేవీపేటకు తీసుకువచ్చి తాండవనది పక్కన దహన క్రియలు జరిపారు. సీతారామరాజు ఆశించి కలలుగన్న స్వాతంత్య్రం ఆయన ఆత్మత్యాగం చేసిన 28 సంవత్సరాలకు ఆగస్టు 15, 1947న భారత ప్రజలకు లభించింది.
అల్లూరి దేశభక్తి, తెగువ, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి. శత్రువు బలమైన వాడని తెలిసినా తనవద్ద పరిమితమైన వనరులే ఉన్నా అచంచల ఆత్మవిశ్వాసం, గుండెలనిండా దేశభక్తితో రవిఅస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యమని చెప్పుకునే ఆంగ్లేయులకు సింహస్వప్నంగా నిలిచిన అల్లూరి ధైర్యసాహసాలు మాతృభూమి దాస్య శృంఖలాలు తెంచాలన్న ఉక్కుసంకల్పం స్ఫూర్తిదాయకం.