JC Diwakar Reddy: ఏపీలో కూడా షర్మిల పార్టీ పెట్టవచ్చు - జేసీ
JC Diwakar Reddy: ఆయన నోరు విప్పితే.. సంచలనాలు.. ఆయన మట్లాడితే.. చలోక్తులు. ముచ్చట ఏదైనా ఒక్క మాటలో కుండబద్దలు కొట్టేస్తారు.
JC Diwakar Reddy: ఆయన నోరు విప్పితే.. సంచలనాలు.. ఆయన మట్లాడితే.. చలోక్తులు. ముచ్చట ఏదైనా ఒక్క మాటలో కుండబద్దలు కొట్టేస్తారు. అలాంటి నాయకుడు ఇప్పుడు తెలంగాణకు వచ్చి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర విభజన జరగకుముందు నుంచి ఇవాళ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే వరకు అన్నింటిని టచ్ చేశారు. ఎవరిని వదలలేదు. ఏ అంశాన్ని మరిచిపోలేదు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. మరీ అలాంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ విసిరిన ఆ లీడర్ ఎవరూ ఆయన చేసిన కామెంట్స్ ఏంటి.?
తెలంగాణ అసెంబ్లీల్లోకి చుట్టపుచూపుగా వచ్చిన టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల రాజకీయలను చెడుగుడు ఆడుకున్నారు. ఒక్కో అంశంపై గుక్క తిప్పుకోకుండా సెటైర్లు విసిరారు. అసెంబ్లీ వాయిదా తర్వాత సీఎల్పీకి వచ్చిన జేసీ తన పాత మిత్రులైన కాంగ్రెస్ నేతలను కలుసుకున్నారు.
రాయల తెలంగాణకు అప్పటి కాంగ్రెస్ నేతలు ఒప్పుకుంటే కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదని జేసీ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ దుకాణం మూయాల్సిన పరిస్థితి దాపరించిందని ఎద్దెవా చేశారు.
ఇదే ఊపులో వైఎస్ కుటుంబాన్ని కూడా వదలలేదు జేసీ. వైఎస్ కుటుంబంలో పంచాయతీ నడుస్తుందని అది సర్దుమనుగితే షర్మిళ పార్టీ ఉండదని జేసీ అంచనా వేశారు. షర్మిళ వైసీపీ కోసం కృషి చేస్తే అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లెక్కలు తేలకపోతే తెలంగాణలోనే కాదు ఏపీలోనూ షర్మిలా పార్టీ పెట్టినా పెట్టవచ్చని జేసీ అభిప్రాయపడ్డారు.
చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులపై కూడా జేసీ తనదైన స్టైల్లో స్పందించారు. అసలు జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబుపై కేసు పెడతారని ఊహించాం. కానీ జగన్ ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేశారో అని జేసీ అనుమానం వ్యక్తం చేశారు. ఒక కానిస్టేబుల్ వచ్చి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. కానీ జగన్, విజయసాయిరెడ్డిలకు నోటీసులు ఇవ్వాల్సివస్తే ఓ లారీ కావాలని జేసీ వ్యంగ్య అస్త్రాలు సంధించారు.
భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ టీడీపీ, బీజేపీ నేతలు కలిసి పనిచేసే అవకాశం లేకపోలేదని బాంబు పేల్చారు జేసీ. రేపు మళ్లీ తెలంగాణ అసెంబ్లీకి వచ్చి సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలుస్తానని సీఎల్పీ నేతలకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు జేసీ.