ఇందూరు బీజేపీలో అధ్యక్ష యుద్ధం.. జిల్లా బీజేపీ అధ్యక్షుని కోసం గ్రూప్ వార్ ?
ఆయన తన మనిషే పార్టీ పగ్గాలు చేపట్టాలంటాడు కాదు కాదు ఎస్సీలకు కమల దళపతిగా చేద్దామంటాడు మరొక నేత. తనకు అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ఇంచార్జీ పట్టుబడుతుంటే మహిళకు ఒక్కసారైనా పగ్గాలివ్వాలని, మరోవర్గం స్వరం పెంచుతుంది. దీంతో ఇందూరు కమల దళపతి ఎవరన్నది ఉత్కంఠగా మారింది. జిల్లా పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలనే దానిపై పార్టీ అధిష్ఠానం సైతం మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ అధ్యక్షుని ఎంపిక, మరోసారి పార్టీలో గ్రూపు రాజకీయాలను తెరపైకి తేవడంతో, పైచేయి ఎవరిదన్నది సస్పెన్స్ గా మారింది.
నిజామాబాద్ జిల్లాలో కమల దళపతి ఎంపిక కోసం నేతల మధ్య పోటీ మొదలైంది. నిన్నటి వరకు జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన పల్లె గంగారెడ్డి పదవీ కాలం ముగియడంతో కొత్తగా పార్టీ పగ్గాలు చెపట్టే నేత తమ వ్యక్తే ఉండాలని ఎంపీ అర్వింద్ వర్గం తన వర్గానికే పగ్గాలు దక్కాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ వర్గం ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీ సిద్దాంతాలపై అవగాహన, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే బలమైన నేత కోసం పార్టీ అధిష్ఠానం అన్వేషిస్తుండగా ఆ ఇద్దరు నేతలు మాత్రం తమ వారికి పగ్గాలు దక్కేలా స్కెచ్ వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ పరాజయం పాలైనా పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తాను చాటుకుంది. పార్లమెంట్ ఎన్నికల విజయంతో ఊపు మీద ఉన్న కమల దళం, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే పార్టీ సంస్ధాగత నిర్మాణ పక్రియపై దృష్టిపెట్టింది. త్వరలో జిల్లా కమిటీ ఎన్నికకు పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టడంతో జిల్లా పగ్గాలు ఎవరు చేపడాతరనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.
ఇందూరు కమళ దళపతిని ఈనెలాఖరు వరకు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బస్వ లక్ష్మీ నర్సయ్య అధ్యక్షుని రేసులో ముందు వరుసలో ఉండగా అర్బన్ ఇంచార్జీగా ఉన్న ధన్ పాల్ సూర్యనారాయణను సైతం పోటీ చేయాలని పార్టీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నాయట. ఐతే ఆయన గతంలో అర్బన్ ఎమ్మెల్యే టికెట్టు ఆశపడి భంగపడ్డారు. తట్టుకోలేని ఆయన అనుచరులు పార్టీ కార్యాలయంపై దాడి చేయడం, ఆయనకు మైనస్ గా మారిందనే టాక్ నడుస్తోంది.
మరో మహిళా నేత గీతారెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న రుయ్యాడి రాజేశ్వర్ సైతం పార్టీ పగ్గాలు చేపట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. నిజామాబాద్ ఎంపీ అర్వింద్, బస్వా లక్ష్మీ నర్సయ్యకు పార్టీ పగ్గాలు దక్కేలా ప్లాన్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.
మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ మాత్రం దళిత సామాజిక వర్గానికి చెందిన నేత కోసం పట్టు బడుతున్నారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి పోటీ చేసిన నాయుడు ప్రకాష్, అవకాశం వస్తే పార్టీ అధ్యక్షుని పీఠం ఎక్కేందుకు సై అంటున్నారట. ఏకాభిప్రాయంతో ఇందూరు కమల దళపతిని ఎంపిక చేయాల్సి ఉండగా గ్రూపు విబేధాలు కారణంగా ఏకాభిప్రాయం రావడం అంత ఈజీ కాదని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
కమల సారథి ఎవరనేది ఈ నెలాఖరులో తేలనుండగా ఎవరి పంతం నెగ్గుతుంది...? ఎవరి మనిషి పగ్గాలు చేపడుతారన్నది ఉత్కంఠగా మారింది. పార్టీ అధిష్ఠానం సీనియర్లకు అవకాశం కల్పిస్తుందా క్రియాశీల నేతలను పీఠంపై కూర్చో బెడతారా అన్న సస్పెన్స్ కు మరికొద్ది రోజుల్లో తెరపడనుంది.