తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు పార్టీ ప్రభంజనం వీచింది. కారు జోరుకు ప్రతిపక్షాలు బేజార్ అయ్యాయి. కనీస స్థాయిలో పోటీ ఇవ్వకుండా చతికిలపడ్డాయి. టిఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అన్న కాంగ్రెస్ రాష్ట్రంలో సత్తా చాటుతామన్న బిజెపి, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బొక్కబోర్లాపడ్డాయి. ఇంతకీ పదేపదే విపక్షాలు ఎందుకు వెనకబడుతున్నాయి? గులాబీ దండుకు కనీసం పోటీ కూడా ఎందుకివ్వలేకపోతున్నాయి? మున్సిపల్ ఎన్నికల్లో ఈ రేంజ్‌లో ఎందుకు ఫెయిల్ అయ్యాయి?
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టుగా మారింది తెలంగాణలో విపక్షాల పరిస్థితి. ఏ ఎన్నికల్లోనూ అధికారపక్షానికి పోటీ ఇవ్వలేక చతికిలబడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ ఎన్నికల్లోనూ కోలుకోలేకపోయాయి. హుజూర్ నగర్‌లోనూ బోల్తాపడ్డాయి. ఇప్పుడు మున్సిపల్, కార్పొరేషన్ ఎలక్షన్స్‌లోనూ కనీసం పోటీ ఇవ్వలేకపోయాయి గులాబీ దళానికి. తెలంగాణలో విపక్షాలు ఎందుకింత తీసికట్టుగా మారిపోతున్నాయి, ఈస్థాయిలో ఎందుకు ఓడిపోతున్నాయన్నడానికి చాలా కారణాలను చెబుతున్నారు రాజకీయ పండితులు.
మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ముందు నుంచే పక్కా వ్యూహంతో పని చేసింది. రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చాక, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించారు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. కేటీఆర్ నేతృత్వంలో ఈసారి మున్సిపల్ ఎన్నికలను అంతా తానే పర్యవేక్షించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే పాతకొత్తా మున్సిపాలిటీల్లో పార్టీ సమన్వయంతో పని చేసే విధంగా దృష్టి సారించారు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బిజెపిలు వెనుకబడ్డాయి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా, ఎన్నికల రిజర్వేషన్లపై గందరగోళంతో కోర్టుకెక్కి సాధించుకోవాల్సి వచ్చింది.
ప్రతిపక్ష కాంగ్రెస్, మున్సిపల్ ఎన్నికలకు మొదటి నుంచే సిద్ధంగా లేకపోవడం పార్టీకి చేటు చేసింది. టిఆర్ఎస్ అన్నీ సరి చేసుకొని ఎన్నికలకు వెళ్లింది. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్‌లో నేతల మధ్య సమన్వయం చేసుకోవడానికి టైం సరిపోయింది. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి ఘోర ఓటమితో, పార్టీ అధ్యక్షుడే కాదు, పార్టీ మొత్తం నైతికంగా చతికిలబడింది. దీంతో పార్టీ నాయకులు కూడా ఎన్నికలంటేనే అయిష్టత ప్రదర్శించే విధంగా తయారయ్యారు. హుజూర్ నుంచి ఇంకా కోలుకోకముందే, మున్సిపల్ ఎన్నికలు తరుముకు రావడంతో బలవంతంగా ఎన్నికల బరిలో దిగి, బొక్కబోర్లా పడింది కాంగ్రెస్.
ఓవైపు అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రతిదీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గరుండి పర్యవేక్షిస్తుంటే, అదే కాంగ్రెస్‌లో నేతల మధ్య సమన్వయం కొరవడింది. రిజర్వేషన్లకు ఎన్నికల నామినేషన్‌కు మధ్య వ్యవధి తక్కువగా ఉండడం కూడా కాంగ్రెస్‌కు నష్టం చేసింది. బలమైన అభ్యర్ధులు ఎన్నికల బరిలో నిలపడంలో పార్టీ నేతలు విఫలమయ్యారు. కొందరు బరిలో ఉన్న చోట వారికి నైతిక స్థైర్యం అందించడంతో పాటు ప్రచారం కూడా సరిగ్గా చేయలేకపోయారు. కీలక నేతలందరూ వారివారి నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి వారివారి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి నుంచి బయటకు రాలేకపోయారు. మిగతా నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సంపత్, చిన్నారెడ్డి, జగ్గారెడ్డి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ అనుచరులను గెలిపించుకునే పనిలోనే నిమగ్నమయ్యారు.
కాంగ్రెస్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండకు, రేవంత్ రెడ్డి మల్కాజ్గిరికి, కోమటిరెడ్డి సోదరులు భువనగిరి పార్లమెంట్ పరిధిలో గట్టిగా పని చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో 15 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రేవంత్ రెడ్డి గట్టిగా పనిచేసినా కిందిస్థాయి క్యాడర్ సరిగా లేకపోవడంతో అనుకున్న ఫలితాలు సాధించలేక పోయారు. సంగారెడ్డి, సదాశివపేట, మున్సిపాలిటీలో జగ్గారెడ్డి అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చారు. మిగతా చోట్ల నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం హస్తం పార్టీకి నష్టం చేసింది.
మొత్తానికి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి, ప్రచారం, పార్టీ నేతల మధ్య సమన్వయంలో విఫలమైంది. అయినా శతాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న పార్టీ కార్యకర్తలు పోరాడి విజయం సాధించారు. కొన్నిచోట్ల రెండు మూడు స్థానాల తేడాతో పలు మున్సిపాలిటీలు కోల్పోవాల్సి వచ్చింది.
తెలంగాణలో తామే బలమైన ప్రత్యామ్నాయం అని భావిస్తున్న బీజేపీ, మున్సిపల్ ఎన్నికల్లో కనీసం అంచనాలు కూడా అందుకోలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలో నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. కిందిస్థాయి కార్యకర్తలు హుషారుగా పని చేసినా, కొన్ని స్థానాల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. మొత్తానికి కాంగ్రెస్ అన్ని వార్డుల్లో డివిజన్లు సాధించకపోయినా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో పాగా వేసింది. బీజేపీ మాత్రం ఆ మాత్రం విజయాలు కూడా నమోదు చేయలేకపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కలతో పాటు నిజామాబాద్‌లో మాత్రమే పట్టు నిలుపుకోగలిగింది. రానున్న రోజుల్లో మరింత పట్టుదలతో పనిచేస్తేనే, టీఆర్ఎస్‌ను ఢీకొట్టే స్థాయికి వెళ్ళగలదు బీజేపీ. లేకుంటే కొన్ని స్థానాలకే పరిమితం అయి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న కల కలగానే మిగిలిపోతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
బీజేపీ కూడా పురపోరును సీరియస్‌గా తీసుకోవడంతో, వాస్తవానికి కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టం కలిగింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ సాగింది. దీంతో ఓట్లు చీలిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్-బీజేపీ మధ్య చీలిపోయి, అధికారపక్షానికి మేలు చేసిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తానికి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు, టీఆర్ఎస్‌కు ఎదురేలేదని మరోసారి నిరూపిస్తే, కనీసం పోటీ ఇవ్వలేక విపక్ష కాంగ్రెస్, బీజేపీలు చేతులెత్తేశాయి. మరి ఇక ముందు టీఆర్ఎస్‌ను ఢీకొట్టేందుకు విపక్షాలు ఎలాంటి వ్యూహాలు రచిస్తాయో, తిరిగి పుంజుకునేందుకు ఎటువంటి ఎత్తుగడలు వేస్తాయో చూడాలి.